టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా… ! ఎందుకో మరి

762

ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని లేవనెత్తిన టీఆర్‌ఎస్‌.. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది నిజంగానే హాట్ టాపిక్. జాతీయ రాజకీయాల అవసరాల దృష్ట్యా నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ పార్టీలన్నింటినీ ఏకం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనగా కనబడుతోంది. దేశంలో గుణాత్మక మార్పు రావాలని, దేశ వ్యాప్తంగా కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ రాజకీయ పొత్తులు అనివార్యమవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. టీఆర్‌ఎస్‌ ఎవరెవరిని తమతో కలుపుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు.. అవసరమైతే సీపీఎంతో కలిసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటించిన రోజునే విలేకరుల సమావేశంలో తన ఆలోచనలను వెల్లడించారు. ఇటీవలే సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు తమ పార్టీ జాతీయ మహాసభల ఏర్పాట్లకు సహకరించాలని స్వయంగా కేసీఆర్‌ను కలవటం.. సంపూర్ణ సహకారం అందిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చేయటం.. చకచకా జరిగిపోయాయి. మరుసటి రోజే ఎడిటర్స్‌ మీట్‌లోనూ సీపీఎం నేతలు పొత్తులకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ సారధ్యంలోని జనసేనతో కలిసి పని చేసేందుకు అభ్యంతరమేమీ లేదని, జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ విధివిధానాలు వెల్లడిస్తే ఆలోచిస్తామని సీపీఎం నేతలు బాహాటంగానే ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తులు, అవగాహన ఉండదని, బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. జాతీయ మహా సభలకు సహకరిస్తానని అన్నందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పేశారు. పొత్తుల దిశగా సీపీఎం ఎటు వైపు మొగ్గు చూపుతుందనేది ఈ పరిణామాలతో దాదాపుగా తేలిపోయింది. వామపక్ష సిద్ధాంతాలు, ఉద్యమ నేపథ్యమున్న సీపీఎం పార్టీ తమ సభలకు అధికార పార్టీ సహకారం కోరడంలోనే పొత్తుల లోగుట్టు బయటపడిందనే వాదనలు మొదలయ్యాయి.

దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌.. సీపీఎం.. జనసేన.. ఎంఐెఎం పొత్తు కూడే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ తమ పార్టీ జన సేన తెలంగాణలో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు.  జనసేనతో కలిసి పని చేస్తామని సీపీఎం కొత్తగా వెల్లడించింది. ఇప్పటికే కేసీఆర్‌ ఫ్రంట్‌కు జనసేన మద్దతు ప్రకటించటం, పనిలో పనిగా పవన్‌ కళ్యాణ్‌ పలుమార్లు కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించటం.. ఇవన్నీ మూడు పార్టీల పొత్తు ఖాయమనే అంచనాలకు బలం చేకూర్చాయి. ఇప్పటికే ఎంఐఎం టీఆర్ఎస్ కు మిత్ర పక్షంగా ఉంది. దీంతో ఈ నాలుగు పార్టీలు ఒక్కటైనట్లే కనబడుతోంది.

నిజానికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మిగతా పార్టీలు అందుకోలేనంత బలం.. బలగాన్ని విస్తరించింది. అధికారం కూడా తోడవటంతో ఒంటరిగానే గులాబీ దళం రాజకీయాలను శాసించే స్థాయిలో ఉంది. ఇప్పటికిప్పుడు పొత్తుల అవసరం టీఆర్‌ఎస్‌కు లేనే లేదని చెప్పుకోవచ్చు. కానీ జాతీయ ఫ్రంట్‌ దిశగా సీఎం కేసీఆర్‌ చేస్తున్న ఆలోచనలు.. పొత్తులకు దారి తీయటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రొఫెసర్‌ కోదండరాం సారధ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ జన సమితి ఎవరితో పొత్తు కూడుతుందనే చర్చలు జోరుగానే ఉన్నాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదిరించటమే లక్ష్యం కావటంతో టీజేఎస్‌ వీలైనన్ని పార్టీలను కలుపుకునే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటైతేనే టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టడం సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు టీజేఎస్‌ వైపు దృష్టి సారించక ముందే.. కేసీఆర్‌ ఒకడుగు ముందుకేసి సీపీఎంను తన దారిలోకి తెచ్చుకున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తులెవరివి.. కత్తులు దువ్వేది ఎవరిపై అనేది.. తేటతెల్లం కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.