ఏడుగురే ఉన్న చిన్న దేశం: టాప్ 10 పల్లెటూరు దేశాలివి

2905

మన పల్లెటూరు.. మన ఊరంత కూడా లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని దేశాల్లో కేవలం ఒకటీ రెండు కుటుంబాలే నివాసముంటున్నాయంటే నమ్మలేకపోవచ్చు. కానీ… అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు, వీసా కూడా ఉండాల్సిందే మరి. అత్యంత చిన్నగా.. కొద్ది పాటి విస్తీర్ణంతో దేశాలుగా అవతరించిన చిన్న చిన్న దీవులు.. స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతాలెక్కడున్నాయో.. ఓసారి ప్రపంచాన్ని అలా చుట్టి వద్దాం.. చూడండి

పలోవ్‌: విస్తీర్ణం: 459 చ.కిమీ.
జనాభా: 21347 మంది
పలోవ్‌ రిపబ్లిక్‌. దాదాపు 300 కంటే ఎక్కువ ద్వీపాలున్న దేశం ఇది. భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి, అడవులు, ప్రత్యేకమైన మొక్కలు, పక్షులు ఈ దేశానికే అందం తెచ్చిపెట్టాయి. ఇక్కడున్న నీటిలో దాదాపు 130 రకాల షార్క్‌ జాతులు నివసిస్తున్నాయట. ఈ దేశంలో ఉన్న మరో అత్యంత అద్భుతమైన దృశ్యం.. రెండు మిలియన్‌ జెల్లీ ఫిష్‌లుండే సరస్సు.


నియూ: విస్తీర్ణం: 261. 46 చ.కిమీ.
జనాభా: 1190 మంది
నియూ ఓషియానియాలో ఒక చిన్న ద్వీపం. చూడటానికి ఇక్కడెన్నో అద్భుతమైన దృశ్యాలున్నాయి. పర్యాటక రంగానికి మాత్రం ప్రజాదరణ లేదు. అందుకే ఈ దేశం విదేశీ సాయం పొందేందుకు న్యూజిలాండ్‌ పై ఆధారపడుతుంది. నియూ రాజధాని కేవలం 600 మంది కంటే తక్కువ ప్రజలుండే చిన్న గ్రామం. కానీ ఈ ద్వీపంలో సొంతం విమానాశ్రయం ఉంది. ఈ దేశం మొత్తానికి ఒకే సూపర్‌ మార్కెట్‌ ఉందట.


3) సెయింట్‌ కిట్స్‌ మరియు నెవిస్‌ :విస్తీర్ణం: 261 చ.కిమీ.
జనాభా : 52329 మంది
ఈ దేశంలో రెండు ద్వీపాలున్నాయి. సెయింట్‌ కిట్స్‌ మరియు నెవిస్‌. ఈ దేశంలో అక్కడి చక్కెర పరిశ్రమలో కనీసం 2.50 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి సెయింట్‌ కిట్స్‌ పౌరసత్వం పొందే అర్హత లభిస్తుంది. ఈ రెండు ద్వీపాలలో నాలుగు లక్షల కంటే తక్కువ లేకుండా ఆస్తిని కొనుగోలు చేసినా పౌరసత్వం ఇచ్చేస్తారు. ఈ ఆర్ధిక పౌరసత్వ కార్యక్రమమే ఈ దేశానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెడుతుందట.


4) ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ హట్‌ రివర్‌ : 75 చ.కిమీ.
జనాభా: 30 మంది
ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ హట్‌ రివర్‌ అనేది ఆస్ట్రేలియాలో అతి చిన్న దేశం. లియోనార్డ్‌ కాస్లె ఈ దేశాన్ని స్థాపించారు. తనకున్న వ్యవసాయ స్థలాన్ని ఒక కొత్త, స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశాన్ని ఏ దేశం గుర్తించనప్పటికీ, ఇప్పటికీ దానికి సొంత కరెన్సీ, స్టాంపులు మరియు పాస్‌పోర్టులున్నాయి. ఈ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యాటకులకు రాయల్‌ ప్రిన్స్‌ లియోనార్డ్‌ హట్‌ విగ్రహాలు కనిపిస్తాయి.


5) టువాలు: విస్తీర్ణం: 26 చ.కిమీ.
జనాభా: 10,959 మంది ప్రజలు
టువాలు ప్రపంచంలోని అతి చిన్న, పేద దేశం. టువాలుకు ఇంటర్నెట్‌ డొమైన్‌ ఇచ్చి ఉండకపోతే ఈ చిన్న దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇంటర్‌నెట్, టీవీ వ్యాపారమే సంవత్సరానికి మిలియన్ల డాలర్లను ఈ దేశానికి తెచ్చిపెడుతుంది.


6) నౌరు: విస్తీర్ణం: 21 చ.కిమీ.
జనాభా: 9,591 మంది
ఇది అతిచిన్న స్వతంత్ర రిపబ్లిక్‌ దేశం. నౌరుకు అధికారిక రాజధానిగాని, ప్రజా రవాణా వ్యవస్థ గానీ లేదు, ప్రైవేట్‌ వాహనాలే దిక్కు. ఇక్కడి పర్యావరణ సమస్యలు పర్యాటకులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నౌరు దేశంలో అత్యంత పెద్ద ఆరోగ్య సమస్య ఊబకాయం. ఇక్కడి జనాభాలో ఊబకాయం రేటు 70 శాతం కంటే ఎక్కువ.


7)ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ సెబోర్గా: విస్తీర్ణం: 4.91 చ.కిమీ.
జనాభా: 312 మంది
ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ సెబోర్గా. నిజానికి ఫ్రెంచ్‌ సరిహద్దుల్లో ఉన్న గ్రామం. ఇటలీ భూభాగంలో ఉన్న ఈ దేశాన్ని ట్రెజెండస్నెస్‌ మార్సెల్లో పరిపాలించాడు. ఈ గుర్తింపు పొందని దేశంలో ముగ్గురే వ్యక్తులతోనే సైన్యం కూడా ఉంది: వీరిలో ఒకరు రక్షణ మంత్రి మరియు ఇద్దరు సరిహద్దు గార్డులు.


8) ది రిపబ్లిక్‌ ఆఫ్‌ మోలోసియా : విస్తీర్ణం: 0.055 చ.కిమీ.
జనాభా: 7 మంది
ది రిపబ్లిక్‌ ఆఫ్‌ మోలోసియ అనే అతి చిన్న దేశం అమెరికాలోని నెవాడా ప్రాంతంలో ఉంది. దీన్ని కెవిన్‌ బాగ్‌ స్థాపించాడు. ఈ దేశంలో జనాభా కేవలం ఏడుగురే. మిస్టర్‌ బాగ్, ఆయన కుటుంబీకులు, 3 కుక్కలు, ఒక పిల్లి, మరియు ఒక కుందేలు. మోలోసియకు జాతీయ గీతం, జాతీయ చిహ్నం మరియు జాతీయ జెండా కూడా ఉన్నాయి. సొంత పాస్‌పోర్టులు జారీ చేస్తుంది. తీవ్రమైన నేరాలకు అక్కడ మరణ శిక్ష కూడా విధించేవారట.


9) సావరిన్‌ మిలిటరీ ఆర్డర్‌ ఆఫ్‌ మాల్టా: విస్తీర్ణం: 0.012 చ.కిమీ.
జనాభా: 1,13,500 మంది
రోమ్‌ భూభాగంలో వాటికన్‌ నగరంతో పాటు మరో చిన్న దేశం ఉంది, దీనిని సావరిన్‌ మిలిటరీ ఆర్డర్‌ ఆఫ్‌ మాల్టా అని పిలుస్తారు. ఇక్కడ కేవలం మూడు బిల్డింగ్స్‌ ఉన్నాయి. వీటిలో రెండు రోమ్‌లో, మూడోది మాల్టా ద్వీపంలో ఉంది. ఈ దేశానికి తన సొంత కరెన్సీ, స్టాంపులు, వెబ్‌ సైట్‌ , కారు నంబర్లు మరియు పాస్‌ పోర్ట్‌ లు ఉన్నాయి.


10) ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ సీల్యాండ్‌ : విస్తీర్ణం: 0.004 చ.కిమీ.
జనాభా : 27 మంది
గ్రేట్‌ బ్రిటన్‌ తీరం నుంచి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఒక సముద్ర వేదిక ఇది. గుర్తింపు పొందని అతి చిన్న దేశం. రీజెంట్‌ ఈ దేశానికి ప్రిన్స్‌గా ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఎవరైనా ఒక రాజు లేదా ఒక సామంతరాజు కూడా కావచ్చట. ఈ దేశం వెబ్‌ సైట్‌ నుంచి పాస్‌పోర్టు సహా ఈ పదవులన్నీ కొనుగోలు చేసే ఆఫర్‌ ఉంది.