తెలుగు సినిమా నటుల మద్దతు టీఆర్‌ఎస్‌కేనా?

714
Nagarjuna, KTR Launches Shooting Center And ANR Gardens At FNCC

తెలంగాణ ఉద్యమకాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులతోపాటు సినిమా రంగానికి సంబంధించినవారిపైనా టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఓ స్థాయిలో రెచ్చిపోయారు. సూపర్‌ స్టార్‌ కృష్ణకు సంబంధించిన పద్మాలయా స్టూడియోస్‌పైన, అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌పైన, రామోజీ ఫిలిం సిటీపైన, రామానాయుడు స్టూడియోస్‌పైన, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పైన ఒంటి కాలితో లేచిన సందర్భాలున్నాయి. దీంతో సినిమా రంగం కూడా ఒక దశలో తమ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవాలని భావించింది. సినీ రంగం ఆంధ్రాకు వెళ్లిపోతే పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారవేత్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ ముఖ్యులు కేసీఆర్‌ దృష్టికి తేవడంతో కేసీఆర్‌ వెనకడుగు వేశారు.

అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సినీ రంగం ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న తలసాని శ్రీనివాసయాదవ్‌ను సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించారు. తలసాని టాలీవుడ్‌ పెద్దలందరినీ కలసి మీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, అంతా మీ ఇష్టానుసారంగానే నడుస్తుందని భరోసా ఇవ్వడంతో టాలీవుడ్‌ శాంతించింది. మరోవైపు ముఖ్యమంత్రి కుమారుడు, భావి సీఎంగా పరిగణించబడుతున్న కేటీఆర్‌.. అటు మెగాస్టార్‌ కుటుంబంతోనూ, ఇటు అక్కినేని కుటుంబంతోనూ, ప్రిన్స్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే లక్షణాలున్న టాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా కేసీఆర్‌కు మద్దతివ్వడం ప్రారంభించింది. హరితహారంలాంటి పథకాల్లో పాలుపంచుకోవడం, వివిధ ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడం చేసింది. కేటీఆర్‌ కూడా కొంచెం బాగుందని అనిపించుకున్న ప్రతి సినిమాను చూడటం, ఆ సినిమాలో నటించినవారిని మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం చేస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాల ఆడియో, ప్రి రిలీజ్‌ ఈవెంట్లకు హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవైపు టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఆంధ్రాలో వేళ్లూనుకుండా చూడటం, మరోవైపు ఆయా హీరోలకు సన్నిహితంగా మెలగడం ద్వారా వారి అభిమానుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడేలా చేసే రెండు వ్యూహాలను అమలు చేసి కేటీఆర్‌ విజయవంతమయ్యారు. సినీ ప్రముఖులు ఇరుక్కున్న డ్రగ్స్‌ కేసును తొక్కిపెట్టడం కూడా ఇందులో భాగమే. ఈ విషయంలో మిగిలిన అన్ని పార్టీలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో టాలీవుడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకే జై కొట్టే అవకాశం ఉంది.