నేడే కోదండరాం కొత్త పార్టీ : కాంగ్రెస్‌ బంపర్ ఆఫర్‌ ఇచ్చిందా

612

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ‘తెలంగాణ జన సమితి’ పేరుతో నేడు కొత్త పార్టీని స్థాపిస్తున్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ జెండాను, లోగోను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 29న బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఇంతకీ కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది.. తెర వెనుక ఎవరున్నారు.. తెలంగాణ జన సమితి పార్టీతో టీఆర్‌ఎస్‌ కు నష్టమా? కాంగ్రెస్‌ కు నష్టమా? అనే చర్చలు జోరందుకున్నాయి.


ఇప్పటికైతే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ జన సమితిని లైట్‌గా తీసుకున్నట్లే కనబడుతోంది. కానీ కోదండరాం రాజకీయ కార్యకలాపాలను కాంగ్రెస్‌ ముందునుంచీ సీరియస్‌గానే పరిగణిస్తోంది. కోదండరాం పార్టీ పెట్టకుండా కాంగ్రెస్‌కు సహరిస్తే వల్ల టిఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని, అప్పుడు అనుకున్న లక్ష్యం సాధించవచ్చని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌ రెడ్డి ఇప్పటికే కోదండరామ్‌ కు సర్దిచెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఉత్తమ్, కోదండరాం పలుమార్లు మంతనాలు జరిపినట్లు రాజకీయ శ్రేణుల్లో గుప్పుమంటోంది. పార్టీ పెట్టకుండా, కాంగ్రెస్‌ కు సహకరించాలని ఉత్తమ్‌ పలుమార్లు తన ప్రతిపాదనతో కోదండరాంకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారట. కానీ పార్టీ పెట్టాలని ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్నట్లు కోదండరామ్‌ తన వాదనతో ముందుకెళ్లినట్లు అర్థమవుతోంది. కొత్త పార్టీకి సరైన అభ్యర్థులు దొరకరని, బలహీనమైన అభ్యర్థులు బరిలో ఉంటే టీఆర్‌ఎస్‌కే లాభం జరుగుతుందని ఉత్తమ్‌ సూచించారట. కానీ కాంగ్రెస్‌ పార్టీని బలహీన పరిచే చర్యలేవీ తాను చేపట్టనని, తాను స్థాపించే పార్టీలో కాంగ్రెస్‌ వారిని చేర్చుకోనని కోదండరామ్‌ ఉత్తమ్‌కు హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది.


ఉద్యమ సమయం నుంచి జేఏసీలో తన వెంట ఉన్న ప్రతినిధులు, స్వతంత్ర వ్యక్తులు, శక్తులను సమీకరించి, ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు ఇదే సందర్భంగా ఇద్దరి మధ్య సూచనప్రాయ అంగీకారం కూడా కుదిరిందనేది.. గుప్పుమంది. కోదండరామ్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని ఇప్పటికే ఉత్తమ్‌ ఢిల్లీలోని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకమాండ్‌ కోదండరామ్‌కు రాజ్యసభ సీటును ఆఫర్‌ చేసిందట. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా సహకరిస్తే రాజ్యసభ సీటిస్తామని కోదండరామ్‌కు హామీ ఇవ్వాలని.. ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు ఉత్తమ్‌ను మరోసారి భేటీకి పంపించారట. ఒకవేళ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని కోదండరామ్‌ కు ఉంటే, పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసి, కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని కోరారట. ఎన్నికలప్పుడు పొత్తులు, అవగాహన గురించి నిర్ణయం తీసుకుంటామని… రాష్ట్రంలో 30 చోట్ల కాంగ్రెస్‌ పార్టీకి సరైన అభ్యర్థులు లేరని, ఆ 30 సీట్లలో కొత్త పార్టీ నుంచి పోటీ చేసే వారికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలవడమో, కాంగ్రెస్‌ టికెట్లు ఇవ్వడమో చేయాలని కోదండరామ్‌ ప్రతిపాదించారని ప్రచారం జరుగుతోంది.


ప్రధానంగా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులు, వ్యక్తులను ఏకతాటిపైకి తెచ్చే వ్యూహం రూపొందించేందుకు కోదండరామ్‌ కొత్త పార్టీ లక్ష్యంగా ఎంచుకోనున్నారు. అదే లక్ష్యం అమలు చేసేందుకు కాంగ్రెస్‌ కోదండరామ్‌ను అక్కున చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని ఏకతాటిపైకి తెచ్చి టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే వ్యూహమే కొత్త పార్టీ ఎజెండాగా కనబడుతోంది.