ముందస్తు ఎన్నికల గురించి కాంగ్రెస్ నేతలు చెబుతున్న భాష్యం ఏమిటంటే..

771

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్.. ఇప్పటికే ప్రధాని మోదీని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. మరికొంతమంది మంత్రులను కలవనున్నారు. కాగా, ముందస్తు ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తమదైన భాష్యం చెబుతున్నారు.

నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబు నాయుడు తదితరులంతా అధికారంలో ఉండి ముందస్తు ఎన్నికలకు వెళ్లి చావుదెబ్బతిన్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ జైపాల్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ కూడా వారి మాదిరిగానే ఎన్నికల్లో పరాజయం పాలవుతారనేది ఆయన ఉద్దేశంగా ఉంది. ఒక్క ఇందిరాగాంధీ మాత్రమే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారని జైపాల్ గుర్తు చేస్తున్నారు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కాకరేపుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మొత్తం 75 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. గత ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తారని భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఉత్తమ్ దెప్పిపొడుస్తున్నారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై నిప్పులు చెరిగారు. అంగ బలం, అర్థ బలం చూసుకుని దురహంకారంతో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు తెచ్చి రాష్ట్రాన్ని మరింత ముంచేయడానికి కేసీఆర్ సిద్ధమయ్యాడని ధ్వజమెత్తుతున్నారు.