ఆ స్టార్ హీరోలిద్దరికి ఇది నిజంగా షాకే!

298

తమిళనాడులోనే కాకుండా దేశంలోనే అగ్ర నటులుగా రజినీకాంత్, కమల్ హాసన్ ల గురించి చెప్పుకోవచ్చు. ఈ హీరోలిద్దరూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వేర్వేరు పార్టీలు ఏర్పాటు చేసి ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పేరిట పార్టీ ఏర్పాటు చేసి తమిళనాడులో సుడిగాడి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ స్టార్ హీరోలిద్దరికీ ప్రముఖ తమిళ టీవీ చానల్.. ‘దినతంతి’ షాక్ ఇచ్చింది. వీరిద్దరికీ తమిళనాడులో పది శాతం కూడా ప్రజాదరణ లేదని తేల్చిచెప్పింది. ఇటీవల కాలంలో తాము చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. తమిళనాడులోని 51 శాతం ప్రజానీకం రజినీకాంత్, కమల్ హాసన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్నారని వెల్లడించింది. ఈ సర్వే వివరాలను న్యూస్ చానల్ గ్రూపునకు చెందిన ‘మాలైమలార్’ పత్రిక సోమవారం ప్రకటించింది.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులో తాము సర్వే చేశామని ఈ సర్వేలో సగానికిపైగా ప్రజలు ఈ హీరోలిద్దరి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చారని దినతంతి పేర్కొంది. అంతేకాకుండా వీరి రాజకీయ ప్రవేశంపై 10 శాతం మంది కూడా సానుకూలంగా లేరని స్పష్టీకరించడంతో ఈ హీరోలిద్దరి అభిమానుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. తమిళనాడులో 1970వ దశకం నుంచి జయలలిత మరణించేవరకు సినిమా రంగానికి చెందినవారే ముఖ్యమంత్రులుగా పనిచేయడం విశేషం. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుందామనుకున్న ఇద్దరు స్టార్ హీరోలకు సర్వే రూపంలో గట్టి షాక్ తగిలింది.