చిరంజీవిని దువ్వుతున్న సాక్షి దినపత్రిక కారణం అదేనా?

1056

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి చెందిన సాక్షి దినపత్రిక ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవిపైన అపార ప్రేమను కురిపిస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150కి తమ టీవీ చానెల్ లో, పత్రికలో భారీ ప్రచారం కల్పించడం, స్వయంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో సాక్షి చానెల్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం దీనికి నిదర్శనాలు. తాజాగా ఏటా సాక్షి వివిధ రంగాల్లో నిపుణులకు అందిస్తున్న ఎక్స్ లెన్స్ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది చిరంజీవికి ‘బెస్ట్ హీరో’ అవార్డు ప్రకటించడం గమనార్హం.

సాక్షి ‘ఆంతర్యాన్ని’ గ్రహించిన చిరంజీవి అవార్డు ఫంక్షన్ కి డుమ్మా కొట్టారు. దీంతో స్వయంగా ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఫ్యామిలీ ఇన్చార్జ్ ప్రియదర్శని రామ్ చిరంజీవి ఇంటికెళ్లి మరీ అవార్డు ఇచ్చి వచ్చారు. అంతేకాకుండా మరుసటి రోజు సాక్షి దినపత్రికలో చిరంజీవికి అవార్డు ఇస్తున్నట్టు రెండు పెద్ద ఫొటోలు, మెయిన్ లో పై పేజీలోనే ఒక కథనం ప్రచురించారు. అందులో వైఎస్ జగన్ భార్య భారతి తనకు సోదరిలాంటిదని చిరంజీవి చెప్పినట్టు రాసుకొచ్చారు. అంతేకాకుండా సాక్షి ప్రతినిధులకు చిరంజీవి సాదరంగా స్వాగతం పలికారని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా భారతిగారు తన మీద ఎంతో అభిమానంతో ఈ అవార్డుతోపాటు చాక్లెట్ బాక్స్ ను కూడా అందించారని, ఆమెది ఎంతో తియ్యటి మనసని చిరంజీవి అన్నట్టు రాసుకొచ్చారు.

వాస్తవానికి.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎల్లో మీడియాతోపాటు ‘సాక్షి’ దినపత్రిక రెచ్చిపోయి కథనాలు రాసింది. ఆయన సభలకు జనాలు ఎవరూ రావడం లేదని, ఆయన సభలు ప్లాప్ షోలని పేర్కొంది. ఇప్పుడు ఆకస్మాత్తుగా చిరంజీవిపై అపార ప్రేమను కురిపించడానికి కారణం.. కాపుల ఓట్లు కొల్లగొట్టడానికే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల వైఎస్ జగన్ నోరుజారి పవన్ కల్యాన్ పైన చేసిన వ్యక్తిగత విమర్శలు, కాపుల రిజర్వేషన్ మీద చేసిన వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గీయులు భగ్గుమన్నారు. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన సాక్షి దినపత్రిక చిరంజీవికి బెస్ట్ హీరో అవార్డు ఇచ్చి కొంతలో కొంత ఈ వ్యతిరేకత నుంచి బయటపడాలనుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫంక్షన్ కు రాకున్నా మరీ ఇంటికెళ్లి అవార్డు అందించి వచ్చారు.