ఈ టాలీవుడ్ భామ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే!

726

అచ్చంగా తమిళ సినీ నటి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిషలానే ఉంటుంది.. టాలీవుడ్ భామ రేష్మా రాథోడ్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో బ్యాచిలర్ ఆప్ లా పూర్తిచేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ వెంకటేశ్, త్రిష జంటగా వచ్చిన ‘బాడీ గార్డ్’ చిత్రంలో త్రిష స్నేహితురాళ్లలో ఒకరిగా నటించింది. ఈ చిత్రం తర్వాత దాసరి మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ఈ రోజుల్లో’ తో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు ఈ అమ్మడికి క్యూ కట్టాయి. సైమా అందించే ఉత్తమ తొలి చిత్ర కథానాయకి అవార్డును కూడా రేష్మ దక్కించుకుంది.

‘ఈ రోజుల్లో’ హిట్ తో ఉదయ కిరణ్ సరసన జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం తదితర చిత్రాల్లో నటించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఇవికాకుండా తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించింది. అయితే ఏ ఒక్క చిత్రం విజయం సాధించకపోవడంతో అమ్మడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ -ఖమ్మం మధ్య ప్రాంతాల్లో సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

తాజాగా తెలంగాణ బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైంది.. ఈ భామ. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ఆయనను కలసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. తనకు అవకాశం ఇస్తే మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తానని అంటోంది. ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది రేష్మ.