రాజ్యసభకు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు.. మై హోమ్ రామేశ్వరరావుకే సీటు..!

3608

రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే విడుదలైంది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల భర్తీపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఈ మూడు స్థానలను గెలుచుకోవటం ఖాయమే. కానీ.. ఈ అవకాశం ఎవరికి దక్కుతుంది.. ఎవరినీ అదృష్టం వరిస్తుంది.. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో ఎవరున్నారు..? అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌.

మూడు స్థానాల్లో ఒకటి యాదవులకు ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అధ్యక్షుడు కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, వరంగల్‌కు చెందిన సుందర్‌రాజ్‌ యాదవ్‌ ఇదే రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి బెర్త్‌ ఖాయమైంది. మరి మిగతా రెండు సీట్లు ఏ సామాజిక వర్గానికి ఇస్తారు…? ఆ రేసులో ఎవరుంటారనేది..? ఉత్కంఠ రేపుతోంది.

 

ప్రస్తుతమున్న సమీకరణాల ప్రకారం ముఖ్యమంత్రికి బంధువు, నిత్యం వెన్నంటి ఉండే జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పేరు రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. గడిచిన 15 ఏళ్లుగా సంతోష్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మితభాషి, మృధు స్వభావిగా పార్టీ నేతలందరిలోనూ ఆయనకు మంచి పేరుంది. పార్టీ సంస్థాగత పదవుల నియామకం సందర్భంగా ముఖ్యమంత్రి గత ఏడాది సంతోష్‌కుమార్‌కు కీలక బాధ్యతలే అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంతకు ముందు నుంచే కేసీఆర్‌కు చెందిన సొంత ఛానెల్‌ టీ న్యూస్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈసారి రాజ్యసభ సీటును సైతం సంతోష్‌కు ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులతో పాటు అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ పాలన.. ఒకే ఇంట్లో నుంచి అందరికీ పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలు చుట్టుముట్టే అవకాశాలను సైతం ముఖ్యమంత్రి బేరీజు వేసుకుంటున్నారు.

సంతోష్‌ పేరు ఒకవైపు ప్రచారంలో ఉండగానే… అంతర్గతంగా ముఖ్యమంత్రి తన అత్యంత సన్నిహితుడైన జూపల్లి రామేశ్వరరావును రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితుడు కావటంతో పాటు రామేశ్వరరావు చిన్నజీయర్‌ స్వామికి ప్రియ శిష్యుడు. మైహోమ్‌ సంస్థల అధినేత, బడా పారిశ్రామికవేత్తగా రామేశ్వరరావు రాష్ట్రంలో అందరికి సుపరిచితుడు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోదరుడు. ఇటీవల శంషాబాద్‌ ఏరియాలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యసభ సీటుపై రామేశ్వరరావుతో చర్చించినట్లు సమాచారం. స్వయంగా ముఖ్యమంత్రి రాజ్యసభ ప్రతిపాదనను లేవనెత్తి.. పెద్దల సభలో మీరు ఉండాల్సిన అవసరముంది.. అని రామేశ్వరరావుతో ప్రస్తావించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మైహోమ్‌ అధినేత.. తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురి అభ్యర్థులో ఉండే అవకాశాలు లేకపోలేదు. చివరి నిమిషంలో కేసీఆర్ రామేశ్వరరావుకు మొగ్గు చూపితే.. సంతోష్కు భంగపాటు తప్పదు.  మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్లు సీఎం పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఎవరిని రాజ్యసభకు పంపినా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు సీఎం మొగ్గు చూపుతున్నారు. ఒక సీటును మైనారిటీ వర్గానికి కేటాయించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్‌(టీడీపీ), రాపోలు ఆనందభాస్కర్‌ (కాంగ్రెస్‌) ఏప్రిల్‌ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఇదే సమయానికి పదవీ విరమణ చేయాల్సిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మరణించారు. అప్పటి నుంచి ఈ స్థానం భర్తీకి నోచుకోలేదు. ఈ మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 5న నోటిఫికేషన్‌ జారీ కానుంది. మార్చి 12లోగా నామినేషన్ల గడువు ముగియనుండటంతో మరో పది రోజుల్లోపే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.