ఈసారి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసే మాగంటి రూప ఎవరో తెలుసా?

891

మాగంటి మురళీమోహన్ నటుడుగానే కాకుండా నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా పేరుగడించారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ఎంపీగా కూడా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమికి మా వెంకన్న చౌదరి (వెంకటేశ్వర స్వామి) కారణమంటూ దేవుడికి కులం అంటగట్టి వివాదాస్పదులవడమే కాకుండా నవ్వులపాలయ్యారు.

మురళీమోహన్ పైన ఎన్నో ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మురళీమోహన్ బినామీ అని, చిన్న, మధ్యస్థాయి చిత్రాలు మాత్రమే చేసిన మురళీమోహన్ కి వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రత్యర్థులు ఆరోపణలు కూడా చేశారు.

కాగా ఏడు పదుల వయసున్న మురళీమోహన్ కు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటు నిరాకరించే అవకాశముందని తెలుస్తోంది. ఆయన కూడా ఆరోగ్య కారణాల రీత్యా, వయసు రీత్యా నియోజకవర్గంలో అంతకుముందులా చురుగ్గా తిరగలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మురళీమోహన్ కోడలు మాగంటి రూప అన్నీ తానై వ్యవహరిస్తోంది.

నియోజకవర్గంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, అన్ని కార్యక్రమాలకు హాజరవడం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులకు సూచనలు చేస్తూ దాదాపు షాడో ఎంపీలా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మాగంటి రూప రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ అధికార వర్గాలు.