వచ్చే ఎన్నికల్లో పోటీకి రాహుల్ సై!

294
  • అమెరికా పర్యటనలో మోదీపై విసుర్లు

  • యువతను ఆకట్టుకునేలా సుదీర్ఘ ప్రసంగం

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్ అక్కడి యువతను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకపక్క తన ప్రత్యర్ధి నరేంద్రమోదీపై విమర్శల వర్షం గుప్పిస్తూనే మరోవైపు, స్వదేశంలోని యువత తమ పార్టీవైపే ఉంటుందన్నట్లు సుదీర్ఘ ప్రసంగం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంకేతాలిచ్చారు. రెండు వారాల పర్యటన నిమిత్తం ఆయన అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బెర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఆయన ప్రసంగించారు. ‘ఇండియా ఎట్‌ 70 : రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ది పాత్‌ ఫార్వర్డ్‌’ అనే అంశంపై మాట్లాడిన రాహుల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. విభజన రాజకీయాలు ప్రజలను వేరుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ప్రధానిగా పోటీ చేస్తారా’ అని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ ‘అవునని’ సమాధానమిచ్చారు.

‘‘నేను పీఎం పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మాది సంస్థాగత పార్టీ. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం దీనిపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. నేను మాత్రమే వారసత్వ రాజకీయాల్లో వచ్చాను అనుకోవద్దు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇదే పద్ధతి ఉంది. అఖిలేశ్‌ యాదవ్‌, స్టాలిన్‌ ఇలా వచ్చిన వారే. అంతెందుకు బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, పారిశ్రామికవేత్త అంబానీ సోదరులు కూడా వారసత్వం ద్వారా వెలుగులోకి వచ్చిన వారే ’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా జీఎస్‌టీ, పాత పెద్ద నోట్ల రద్దుపై కూడా రాహుల్‌ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతోందని, వ్యవసాయానికి, రైతులకు తీరని నష్టం వాటిల్లుతోందని రాహుల్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్‌ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. కాలిఫోర్నియాలో పర్యటన ముగించుకుని లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లనున్నారు.

ఆ తర్వాత వాషింగ్టన్‌, న్యూయార్క్‌ల్లో పర్యటించి ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. భారత్‌ తప్ప మరేయితర ప్రజాస్వామిక దేశం అత్యధిక జనాభాను పేదిరికం నుంచి బయట పడేలేకపోయిందని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ ప్రజలను ఐక్యం నిలిపింది ఒక్క అహింస మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అయితే మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ అహింసపైనే ఇప్పుడు కొందరు దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. కోపం, హింస వినాశనానికి దారితీస్తుందన్న రాహుల్‌ రాజకీయ వైషమ్యాలు పతనం వైపు నడిపిస్తాయని చెప్పారు.

1984 అల్లర్ల అంశాన్ని ఉటంకిస్తూ న్యాయం కోసం పోరాడే వారికి తాను మద్ధతుగా ఉంటానని, హింసను ఖండిస్తానని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్‌ గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీలను హింసే బలితీసుకున్నాయని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకే తెలసని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్ష వామపక్ష రహిత(లెఫ్ట్ ఆర్‌ రైట్‌) దేశాల్లో దేని వైపు భారత్‌ ఉంటుందన్న ప్రశ్నకు తాము ముక్కుసూటిగా(స్ట్రెయిట్‌)గా ఉంటామని ఇందిర చెప్పేవారని ఈ సందర్భంగా రాహుల్‌ ప్రస్తావించారు.

ప్రజాస్వామిక వాతావరణంలో అత్యధిక ఉద్యోగాల కల్పన చేపడుతున్న దేశాలు చైనా, భారత్‌ మాత్రమేనని రాహుల్ అన్నారు. అయితే ఆర్థిక సలహాదారుల, చట్ట సభలను సంప్రదించకుండా డీమానిటైజేషన్‌ లాంటి నిర్ణయం తీసుకోవటం ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంప్రదింపుల ద్వారానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప బలవంతంగా ప్రజలపై తమ అభిప్రాయాలను రుద్దబోదని స్పష్టం చేశారు. 2012 సమయంలో పార్టీలో కొందరు నేతల మధ్య అహంకారం పెరిగిపోవటం మూలంగానే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు.

కీలక బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న రాహుల్ అది మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం పార్టీ అధిష్టానం నిర్వహించే ఎన్నికలు ఇలా ఓ క్రమపద్ధతి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామిక పరిస్థితులు కాస్త భిన్నంగా తయారయ్యాయని, వారసత్వ పాలన పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనపై వస్తున్న సెటైర్లపై మరో ప్రశ్నకు రాహుల్‌ బదులిస్తూ వెయ్యి మందితో కూడిన ఓ బీజేపీ యాంత్రంగం కంప్యూటర్ల ముందు కూర్చుని తనను తిడుతున్నారని, దేశాన్ని నడిపించే ఓ పెద్దాయన వారిని ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు.

తొమిదేళ్ల పాటు మన్మోహన్‌, చిదంబరం, జైరామ్‌ రమేశ్‌ లాంటి రాజకీయ వేత్తలతో తాను జమ్ము కశ్మీర్‌ వ్యవహారంపై పని చేశానని, తమ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఉగ్రవాదం జాడలు లేకుండా పోయిందని, కశ్మీర్‌‌లో శాంతి కూడా నెలకొందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మన్మోహన్‌ హయాంలో 2013లో ఉగ్రవాద నడ్డివిరిచిన సమయంలో తాను సంతోషంతో మన్మోహన్‌ సింగ్‌ను హత్తుకుని మనం సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని చెప్పానని రాహుల్ గుర్తు చేశారు. కశ్మీర్‌ అధికార పార్టీ పీడీపీ యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పని చేసిందని, కానీ, ఎప్పుడైతే బీజేపీతో చేతులు కలిపిందో అప్పుడే మోదీ పీడీపీని సర్వనాశనం చేశారని రాహుల్‌ విమర్శించారు.

మోదీ హయాంలోనే కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగిన పోతున్నారని, హింస కూడా చెలరేగి పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని పేర్కొన్నారు. అయితే మోదీ ఓ మంచి వక్త అన్న రాహుల్‌ ఒక జనసందోహంలో ఉన్న మూడు నాలుగు గ్రూపులకు సముదాయించేలా మాట్లాడటం ఒక్క మోదీకే చెల్లతుందని చెప్పారు. కానీ, పార్టీలో తనతో పాటు పని చేసే సభ్యులతో మాత్రం ఆయన(మోదీ) సంబంధం లేనట్లు ఉంటారని, ఈ విషయం బీజేపీ పార్టీకి చెందిన కొందరు నేతలు తనతో చెప్పారని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకోవటం మూలంగా ప్రభుత్వ లోపాలను, అవినీతిని సమాజానికి తెలియజేయాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నానికి ఆటంకంగా మారిందని రాహుల్‌ గాంధీ తెలిపారు.