కృష్ణయ్య రాహుల్ గాంధీని కలవడం వెనుక కారణం ఇదేనా?

451

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో్ ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.. కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిపైన, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైన ఓ స్థాయిలో రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు వీలైతే అధికారంలోకి రావడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నిస్తోంది.
తాజాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఊపు తేవడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణలో దింపింది. డ్వాక్రా మహిళలతోనూ, మహిళా వ్యాపారవేత్తలు, పత్రికా సంపాదకులతోనూ రాహుల్ మంతనాలాడారు.

ఈ క్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య.. రాహుల్ గాంధీని కలవడం సంచలనం రేపింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయ్య నాటి నుంచి తెలుగుదేశం పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ నిర్వహించే సమావేశాలకు, మహానాడుకు, పొలిట్ బ్యూరో మీటింగ్ లకు ఆయన వచ్చిన సందర్బాలు లేవు.

ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రాహుల్ గాంధీని కలసి దాదాపు మూడు గంటలసేపే మంతనాలాడటం అన్ని పార్టీల్లోనూ చర్చకు దారితీసింది. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీని కోరడానికే ఆయన్ను కలిశానని ఆర్.కృష్ణయ్య చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని వివిధ పార్టీలు అనుమానిస్తున్నాయి. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కృష్ణయ్యను కేంద్రమంత్రిగా కూడా చేస్తామని చెప్పినట్టు సమాచారం.