ఆ టాప్ దర్శకుడి ఆఫర్ ను తిరస్కరించిన అందాల భామ. కారణమదేనా?

173

భాలీవుడ్ తోపాటు హాలీవుడ్ మూవీస్ లోనూ, అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలోనూ తన ప్రతిభ చాటుతోంది.. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా. ఇటీవల కాలంలో ఈ భామ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదానికి దారితీస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘భరత్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించి తీరా షూటింగ్ ప్రారంభం కాబోయే ముందు ఈ చిత్రంలో తాను నటించలేనంటూ చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. దీనిపై ఆ చిత్ర దర్శకుడు, నిర్మాతల నుంచి గట్టి విమర్శలే ఎదుర్కొంది.. ప్రియాంక.

తాజాగా బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ దర్శకుడు, తన సినిమాలను గ్రాండియర్ గా తెరకెక్కించే దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తన చిత్రంలో హీరోయిన్ గా నటించాలంటూ ప్రియాంకాను కోరగా ఆమె తిరస్కరించిందనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. నిజ జీవితంలో ఒక లేడీ గ్యాంగస్టర్ జీవిత కథతో ప్రియాంకా చోప్రాను ప్రధాన పాత్రలో పెట్టి సినిమా నిర్మించాలని భన్సాలీ అనుకున్నాడు. అయితే ఈ ముద్దుగుమ్మ తిరస్కరించడంతో మరో హీరోయిన్ ను వెతుక్కునే పనిలో పడ్డాడు భన్సాలీ.

వాస్తవానికి భన్సాలీ దర్శకత్వంలో ప్రియాంకా చోప్రా ‘బాజీరావు మస్తానీ’లో నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి ముందు బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకోణ్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘రామ్ లీలా’లోనూ ప్రియాంకా ఒక సాంగ్ లో మెరిసింది. ‘రామ్ లీలా’ కూడా మంచి విజయం సాధించింది. తనకు రెండు హిట్ చిత్రాలు ఇచ్చిన సంజయ్ లీలా భన్సాలీ సినిమాను తిరస్కరించి ఈ భామ తప్పుచేసిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.