కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను ఎక్కడ పోటీకి దింపుతారు..?

1359

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త ప్రియ మిత్రుడు…ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అనే దక్షిణాది రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మూడేళ్ల ముందు నుంచే ప్రకాష్‌రాజ్‌ తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ అంటే ప్రకాష్‌రాజ్‌కు అభిమానం. మూడేళ్ల కిందటే గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రకాష్‌రాజ్‌ స్పందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కేశంపేట మండలంలో కొండా రెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడి గ్రామ ప్రజలు, రైతులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. అదే ప్రాంతంలో తనకున్న ఫామ్‌ హౌజ్‌కు వెళ్లినప్పుడల్లా గ్రామ బాగోగులను తెలుసుకునేందుకు, అక్కడి అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రకాష్‌రాజ్‌ చొరవ చూపుతూనే ఉన్నారు.

prakashraj at kondareddypally (third party source)

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రకాష్‌రాజ్‌కు వ్యవసాయమంటే అమితాసక్తి. అదే ఆసక్తి ఇద్దరినీ దగ్గరికి చేసిందనే అభిప్రాయాలున్నాయి. ప్రకాష్‌రాజ్‌ సినిమాల్లో నటనకు ఎంత సమయం కేటాయిస్తారో వ్యవసాయానికి అంతే సమయం కేటాయిస్తారు. తమిళనాడులో తనకున్న ఇరవై ఎకరాల పొలంలో కూరగాయాలతో పాటు వివిధ పంటలను ప్రకాష్‌రాజ్‌ సాగు చేయిస్తున్నారు. తమిళనాడులో రైతుల సమస్యలపై పోరాటం, ఉద్యమించటంలో ముందు నిలిచారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పంటలకు చీడపీడలు వచ్చినప్పుడల్లా.. ఏం చేద్దాం.. అంటూ సలహాలు సూచనలను తీసుకునేందుకు ప్రకాష్‌రాజ్‌ ఆదర్శ రైతులందరినీ కలిసొస్తారట. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయ పంథాను ప్రకాష్‌రాజ్‌ అవసరం వచ్చినప్పుడల్లా ఎండగడుతున్నారు. బీజేపీ వ్యతిరేకిగా తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా బలమైన ముద్ర వేసుకున్నారు.

ఇదే సమయంలో… కేసీఆర్‌ పిలుపునిచ్చిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు ప్రకాష్‌రాజ్‌ ఆకర్షితుడయ్యాడు. ఫ్రంట్‌ తరఫున జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు నడుం బిగించారు. ‘నేను మీ వెంటే ఉంటా…. దేశంలో మార్పు రావాలంటూ మీరు చేసిన సవాల్‌ నాకు నచ్చింది..’ అంటూ ప్రకాష్‌రాజ్‌ తనంతట తానే కేసీఆర్‌తో దోస్తీ కట్టారు. అదే లక్ష్యంతో ఇద్దరి మధ్య ప్రియ మిత్రుల బంధం నెల రోజుల్లోనే బలపడింది. వివిధ రాష్ట్రాల నేతలతో కేసీఆర్‌ ఫ్రంట్‌పై జరిపే సంప్రదింపులనుు.. ప్రకాష్‌రాజ్‌ తనకున్న పరిచయాలతో వేగవంతం చేస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవల బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ– కేసీఆర్‌ భేటీ తెర వెనుక.. తెర ముందు ప్రకాష్‌రాజ్‌ హల్‌చల్‌ చేసినట్లే కనబడింది.

కొద్ది రోజుల్లో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధితోనూ కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అందుకు సంబంధించి సంప్రదింపులు, ముందస్తు మంతనాల్లో ప్రకాష్‌రాజ్‌ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌ ఫ్రంట్‌లో ప్రకాష్‌ రాజ్‌ ప్రాధాన్యం అంతకంతకు పెరిగిపోతోందని అర్థమవుతోంది. ఇంతకీ ప్రకాష్‌రాజ్‌ భవిష్యత్తు కార్యాచరణ ఏంటీ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తారా..? అనేది కొంతకాలం చర్చనీయాంశమే. ఫ్రంట్‌ తరఫున దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా ఎంపీగా పోటీ చేసేందుకు ప్రకాష్‌రాజ్‌ సిద్దంగా ఉన్నట్లు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రకాష్‌రాజ్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రంట్‌ వేగం పుంజుకున్న కొద్దీ ప్రకాష్‌రాజ్‌ పాత్రపై మరింత స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే కేసీఆర్‌ ఫ్రంట్‌లో అత్యంత కీలకమైన నాయకుడిగా ప్రకాష్‌రాజ్‌ రాజకీయ ఎంట్రీ మొదలైంది.