టీవీ షో చేయడం వెనుక పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

381

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పర్యటనలతో దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ ఆయన చేస్తున్న ప్రసంగాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్న పవన్ ఈ నెల 24 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లా పవన్ కల్యాణ్ సొంత జిల్లా కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనసేనాధిపతి పర్యటనకు పెద్ద ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా, పవన్ అతి త్వరలో టీవీ షో తో ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ పత్రిక కథనం ప్రకారం.. వారంలో రెండుసార్లు అరగంట చొప్పున ఈ టీవీ షో ఒక జాతీయ న్యూస్ చానెల్ లో ప్రసారమవుతుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు చెందిన ఒక టీమ్ టీవీ షోకు సంబంధించిన థీమ్, స్క్రిప్ట్ వర్క్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉందని తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రయోక్తగా నిర్వహిస్తున్న ‘సత్యమేవ జయతే’ మాదిరిగానే కేవలం ప్రజా సమస్యలు, పర్యావరణానికి, అభివృద్ధికి సంబంధించిన సామాజిక సమస్యలను ఈ టీవీ షోలో చర్చిస్తారని అంటున్నారు. దీనివల్ల జనసేన పార్టీకి కూడా మంచి ప్రయోజనం ఉంటుందని, పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పవన్ భావిస్తున్నారు. శ్రీకాకుళం ఉద్దానం సమస్య మొదలుకుని ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ సమస్య వరకు, విద్య, వైద్యం ఇలా ఎన్నో సామాజిక అంశాలపై టీవీ షో ఉండనుంది. ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులోనూ ఈ షోను ప్రసారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియా టీమ్ ఇప్పటికే సత్యమేవ జయతే ప్రోగ్రామ్ నిర్వాహకులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటోంది. ఏయే అంశాలు, టాపిక్స్ ను చర్చించాలనే అనే అంశంపై నిపుణుల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తున్నారు.