త్వరలోనే పవన్ కల్యాణ్ టీవీ ఛానల్

761

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తనకంటూ మీడియా ఉండాలని పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జనం కోసం (జే టీవీ) పేరుతో ఒక ఛానల్‌ ను ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. పవన్‌ సన్నిహితుడు, విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త దీని నిర్వహణ బాధ్యతలు చేపట్టారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని టీవీ 99 చానల్‌ ను పవన్‌ టేకోవర్‌ చేశాడని, ఆర్థికపరమైన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులను ఏం చేయాలనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం. ఉన్నవారినే అలాగే ఉంచేసి చానెల్‌ హెడ్, బ్యూరో ఇన్‌ చార్జులు, టీవీ అవుట్‌ పుట్‌ ఎడిటర్, ఇన్‌ పుట్‌ ఎడిటర్‌ తదితర ఉద్యోగాల్లోకి జనసేన ఐడియాలజీతో ఉన్నవారిని, వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేస్తున్న పవన్‌ అభిమానులను తీసుకోనున్నారని అంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లకు మీడియా అండదండలున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ 5, టీవీ 9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, సీవీఆర్‌ వంటి చానెళ్లు తెలుగుదేశానికి వంతపాడుతూ పవన్‌ కల్యాణ్‌ పై విషం చిమ్ముతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు విశాలాంధ్ర, ప్రజాశక్తి, 10టీవీ, టీవీ99 అండగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా మీడియా ఏర్పాటుపై దృష్టి సారించింది. త్వరలో టీవీ చానల్‌ తోపాటు జనసేన లేదా కృష్ణా పత్రికను కూడా ప్రారంభించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మీడియా కూడా ఉంటే పవన్‌ కల్యాణ్‌ కున్న ఇమేజ్, పవన్‌ సామాజికవర్గం, ఇతర కులాల్లో ఆయన అభిమానులు, తటస్థులతో రాజకీయ బలగాన్ని సునాయాసంగా విస్తరించే అవకాశముందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలకు కావాల్సింది జనంలో ఇమేజ్, కులం, డబ్బు… వీటితో పాటు మీడియా కూడా ముఖ్య సాధనంగా మారింది. తమను పాజిటివ్‌గా ఫోకస్‌ చేసే మీడియా లేకపోతే ప్రజల్లో ఎంత పలుకుబడి ఉన్నా టార్గెట్‌ను అందుకునే అవకాశాలు సన్నగిల్లుతాయనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఫెయిలైన ప్రజారాజ్యం పార్టీ అందుకో ఉదాహరణగా మీడియాలో ప్రచారంలో ఉంది.