తెలుగులో కొత్త పత్రిక వీ6

1437

తెలుగులో మరో పత్రిక రాబోతోంది. ఇటీవలే సీఎల్‌ రాజం సారధ్యంలో విజయక్రాంతి పత్రిక రానే వచ్చింది. అప్పుడే మరో పత్రిక మార్కెట్లోకి వస్తుందా.. అవును నిజమే. ఎన్నికల సీజన్‌ కదా.. అన్ని పార్టీలకు మీడియా ప్రాధాన్యం అంతకంతకు అవసరమే. మీడియాపై మక్కువ పెంచుకున్న పారిశ్రామికవేత్తలకు ఇదే అసలు సిసలైన సమయం. అందుకే తెలుగులో కొత్త పత్రికలు కూడా పోటా పోటీగానే పుట్టుకు వస్తున్నాయని చెప్పుకోవాలి. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా వైరల్‌గా మారిన ఈ రోజుల్లో ప్రింట్‌ మీడియాకు ఉండే క్రేజీ ఎక్కువే. అందుకే తెలుగులో ఎలక్ట్రానిక్‌ మీడియాలో.. ప్రత్యేకంగా తెలంగాణ మీడియాలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వీ6 ఇప్పుడు ప్రింట్‌ మీడియాలో అడుగుపెడుతోంది. ఉద్యమ సమయంలో మన భాష, మన యాసతో టీ న్యూస్‌కు పోటీగా రంగంలోకి దిగిన వీ6 క్రమంగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తీన్‌ మార్‌ వార్తలు, బతుకమ్మ పాటలతో కొత్త రాష్ట్రంలో ఇంటింటా వీక్షక లోకాన్ని విస్తరించుకుంది. ఇప్పుడదే వీ6 ప్రింట్‌ మీడియాలో అడుగు పెడుతుండటం గమనార్హం.

మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌ సారధ్యంలోని వీ6.. ఇప్పుడు పత్రికగా రాబోతోంది. వీలైనంత తొందరగా ఎన్నికలకు ముందే పత్రికను మార్కెట్లోకి తెచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌ కూడా మొదలైంది. ఎడిటర్ ఎవరు.. టీవీలో కీలక పాత్ర పోషిస్తున్న అంకం రవి.. పత్రిక బాధ్యతలు నిర్వహిస్తారా.. వివేక్ కుటుంబీకులు నేరుగా పత్రిక వ్యవహారాలు చూసుకుంటారా..  ఇంతకీ జిల్లా ఎడిషన్లుంటాయా.. విజయక్రాంతి తరహాలో ఒక్కటే మెయిన్‌ ఎడిషన్‌ ఉంటుందా, ఇప్పుడున్న ప్రధాన పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతితో పోలిస్తే కొత్తగా ఏముంటుంది.. తెలంగాణ యాసతో పాటు భాషను అక్షర రూపంలో సంధించే కొత్త దనమేమైనా ఉంటుందా.. అనేది ఇప్పటికైతే ఆసక్తికరమే. కానీ అన్ని పత్రికలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న రాజకీయ రంగే ఈ పత్రికకు సూటిగానే ఉంది. వివేక్‌ టీఆర్‌ఎస్‌లో కీలక నాయకునిగా ఉండటంతో కొత్త పత్రిక సైతం నమస్తే తెలంగాణ తరహాలో కేసీఆర్‌కు నమస్తే.. వీ6 అన్నట్లుగానే ఉంటుందనుకోవటంలో ఎలాంటి సందేహమే లేదు.