జేసీ దెబ్బకు విమానశాఖ పల్టీలు: నో ఫ్లై లిస్ట్

1409

అవును మన లీడర్లు తోపులు.. గ్రేటాది గ్రేటులు. ఎందుకంటే ఏం చేసినా వాళ్లకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వాళ్ల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఎంతగా అంటే… కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవాలంటే ముందుగా సదరు లీడర్ పేరు గుర్తుకు తెచ్చుకోవల్సినంతగా..! కార్పొరేటర్ నుంచి ఎంపీల దాకా ఎవ్వరూ ఏం తక్కువ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్లే కారణమవుతారు.

ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ప్రపంచంలో ఏ దేశం ఇప్పటి వరకు తీసుకోని నిర్ణయాన్ని మనదేశ పౌరవిమానయానశాఖ తీసుకుంది. నో ఫ్లై లిస్ట్ పేరుతో కొన్ని నియమనిబంధనల లిస్ట్ తయారుచేసింది. ఫ్లైట్ లో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించేవారిపై చర్యలు తీసుకునేందుకు కొన్ని రూల్స్ తయారు చేసిందన్న మాట. ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రం నో ఫ్లై లిస్ట్ తయారుచేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎలాంటి అసభ్య ప్రవర్తనకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఈ లిస్ట్ లో ఉంటుంది.

అసభ్య ప్రవర్తనలను విమాన శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. తీవ్రతను బట్టి పనిష్మెంట్ ఉంటుందని ప్రకటించింది.

1. దూషించడం, మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయడం. ఇలా చేసిన ప్రయాణికులపై గరిష్టంగా మూడు నెలల నిషేధం విధిస్తారు.
2. సిబ్బందిని కొట్టడం, నెట్టడం, భౌతికంగా దాడులు చేయడం. అసభ్యంగా తాకడం వంటివి.
ఇలా చేస్తే ఆరు నెలల వరకు నిషేధం విధిస్తారు.
3. ప్రాణభయం కలిగేలా వ్యవహరించడం, బెదిరింపులకు పాల్పడటం, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ను ధ్వంసం చేయడం వంటివి.
దీనికి రెండేళ్ల నుంచి జీవితకాలం పాటు నిషేధం విధించేలా రూల్స్ తయారుచేశారు.
అయితే.. ఒకసారి నిషేధానికి గురై రెండోసారి అదేవిధంగా వ్యవహరిస్తే.. గతంలో విధించిన పనిష్మెంట్ కు రెట్టింపు పనిష్మెంట్ ఇవ్వనున్నారు.
అయితే… విమానంలోపల జరిగిన దాడులకు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి.

గతంలో ఎంపీ రవీంద్ర గైక్వాడ్, జేసీ దివాకర్ రెడ్డి ఫ్లైట్ సిబ్బందిపై దాడి చేశారు. వారిపై కొద్ది రోజులు నిషేధం విధించారు. ఈ ఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దీంతో చాలా కసరత్తు చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నిర్ణయాలు తీసుకుంది. కేవలం ఇద్దరు లీడర్లు చేసిన పనికి పౌరవిమానయానశాఖ ప్రపంచంలో ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకుంది.