ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో దగ్గుబాటి రాణా లుక్ చూసి నారా లోకేశ్ ఏమన్నాడంటే..

865

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం.. యన్టీఆర్. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దగ్గుబాటి రాణా చంద్రబాబు నాయుడిగా, విద్యాబాలన్ యన్టీఆర్ భార్య నందమూరి బసవతారకంగా, బాలకృష్ణ.. యన్టీఆర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా ప్రముఖ నటీనటులెందరో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రానికి సంబంధించి వినాయకచవితి నాడు నారా చంద్రబాబు నాయుడి లుక్ ని విడుదల చేశారు. యన్టీఆర్ చిన్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడిగా దగ్గుబాటి రాణా ఈ లుక్ లో అదరగొడుతున్నాడు. 1984లో చంద్రబాబు నాయుడి భుజంపై యన్టీఆర్ చేయి వేసి మాట్లాడుతున్న స్టిల్ మాదిరిగానే ఈ లుక్ లో యన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ.. చంద్రబాబు పాత్రధారి రాణా భుజంపై చేయివేసి మాట్లాడుతున్న స్టిల్ బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఈ లుక్ పై స్పందించిన చంద్రబాబు నాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘చరిత్ర భావితరాలకు సంపద. ప్రజల హృదయాల్లో తమ కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇద్దరు లెజెండరీ వ్యక్తుల చరిత్రని తెరకెక్కించడం ఒక సాహసం. అలాంటిది అప్పటి పరిస్థితులను మళ్లీ సృష్టించడం గొప్ప విషయం. ఈ పోస్టర్ బాలయ్య మామయ్య, రాణా మరియు వారి బృందం పడుతున్న కష్టానికి నిదర్శనం!’ అంటూ నారా లోకేశ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక స్టిల్ ను కూడా పోస్టు చేశారు.