రజినీకాంత్ ను బాధపెట్టిన మోహన్ బాబు వ్యాఖ్యలు ఇవేనా?

816

ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రాణ మిత్రులు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ‘ఏరా.. ఒరేయ్’ అని పిలుచుకునేంత చనువు ఉంది. అంతేకాకుండా మోహన్ బాబు పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్ గెస్ట్ రోల్ కూడా చేశారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా రజినీకాంత్ ఉద్యక్తులవుతుండగా, ప్రస్తుతం మోహన్ బాబు ఏ పార్టీలోనూ లేరు.

ఇదిలా ఉండగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సంస్మరణ దినంగా సందర్భంగా కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ కరుణానిధి కుమారుడు స్టాలిన్ తనకు సోదరుడులాంటి వాడని, వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించడం హాట్ టాపిక్ అయింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆహ్వానం మేరకు తాను ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, ఆయన ముఖ్యమంత్రి అయితే ఒక సోదరుడిగా సంతోషిస్తానని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు రాజేశాయని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలని రజినీకాంత్ అనుకుంటున్నారు. తరచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాంటిది తన ప్రాణ మిత్రుడు మోహన్ బాబు తనను కాకుండా స్టాలిన్ సీఎం కావాలని కోరుకోవడంపై సన్నిహితుల దగ్గర రజినీకాంత్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. అందులోనూ తమిళనాడులోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో రజినీ సన్నిహితులు కూడా ఆశ్చర్యపోయారట. ముక్కోపిగా, ముక్కుసూటి మనిషిగా పేరున్న మోహన్ బాబుకు ఆ వ్యాఖ్యలు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టేలా ఉన్నాయి.