ప్రతిష్టాత్మక బ్యానర్ లో అవకాశం కొట్టేసిన మెగా హీరో

330

ఫిదా’, ‘తొలిప్రేమ‌` చిత్రాల‌తో ఘన విజయాలు సాధించాడు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా కుటుంబంలోని మిగతా హీరోలు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ మాస్ సినిమాలకే పెద్దపీట వేస్తుండగా వరుణ్ తేజ్ మాత్రం మొదటి నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఒక్కో మెట్టూ పైకెక్కుతున్నాడు. వరుణ్ విజయాల పట్ల మెగా ఫ్యామిలీ ముఖ్యంగా వరుణ్ తండ్రి నాగబాబు చాలా ఆనందంగా ఉన్నాడు.

ప్రస్తుతం వరుణ్.. ‘ఘాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘సమ్మోహనం’ ఫేమ్ అదితీరావు హైదరీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2’ అనే సినిమాలోనూ వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ మరో హీరోగా నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కాకుండా మరో ప్రతిష్టాత్మక బ్యానర్ లోవరుణ్ తేజ్ అవకాశం కొట్టేశాడని టాలీవుడ్ సమాచారం. వరుస విజయాలతో సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్ వరుణ్ తేజ్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రస్తుతం హీరో రామ్ తో ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తాడని సమాచారం. హీరోయిన్లను, మిగతా తారాగణాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.