మహానటి సినిమా రివ్యూ.. చూడాల్సిన సావిత్రి కథ

904

నాగ్ అశ్విన్ గురించి మాట్లాడాలి.
మహానటి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి.
కీర్తి సురేష్ అనే ఓ పసికూన మహానటి సావిత్రిని నలుపుతెలుపుల తెరమీంచి లాక్కొచ్చి ఆధునిక సెల్యులాయిడ్ మీద అద్బుతంగా ఆవిష్కరించి ఉండవచ్చు గాక..నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి.
దుల్కర్ లూ మోహన్ బాబులూ సమంతలూ ఎనభైవ దశకాన్ని తెంపుకొచ్చి మన కళ్లముందు రమ్యంగా అతికించి ఉండవచ్చుగాక…
నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి.
మహానటి సినిమాను అన్నీ తానే అయి కూర్చిపేర్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే తప్పక మాట్లాడాలి.

ఎవరండీ ఈ నాగ్ అశ్విన్. తెలుగు సినిమా ఎవరైనా ఇలా తీస్తారా. తెలుగు సినిమా అంటే ఎలా ఉండాలీ..అమ్మడుతో కుమ్ముడాటలుండాలి,
ముఖ్యమంత్రయినా సరే ముష్టిఘాతాలతోనే సమస్యలను పరిష్కరించాలి, కలల్లో కూడా ఊహించలేని అవాస్తవాలే ద్రుశ్యాలై ఉండాలి..పైగా బయోపిక్ అంటే ఇంకెలా ఉండాలి..నాలుగైదు వివాదాస్పద సన్నివేశాలు గుప్పించేసి వాటిని ముందే మీడియాకు లీక్ చేసి బుల్లితెర చర్చలలో వాటిని నానాయాగీ చేసి ఆ తరువాత సినిమా రిలీజ్ చేయాలి. వీలైతే కొంత డర్టీ పిక్చర్ లా మార్చేయాలి. అలా కాక ఇవేమీ లేకుండా ఒక నటి వెండితెర వెలుగుల వెనుక చీకట్లనీ, ఒక తార గుండెలోతుల కన్నీటి కీలల చాటు మెరుపు మరకలనీ ఉన్నవి ఉన్నట్టుగా ద్రుశ్యీకరిస్తే…
ఆ దర్శకుడి గురించి కాక మరెవరి గురించి మాట్లాడగలం చెప్పండి…
నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి.

నిజానికి నాగ్ అశ్విన్ గురించి చాలా మంది ఎవడే సుబ్రహ్మణ్యం నాడే మాట్లాడుకున్నారు. ఎవడీ నాగ్ అశ్విన్ అని.
అయితే ఒక వ్యక్తి తనను తాను అన్వేషించుకుంటూ హిమాలయాలకో దూద్ కాశీకో వెళ్లడం అనే తాత్వికతను సినిమా చేయడం కొంచెం కష్టమయినా తేలికే. ఆ కష్టాన్ని తేలికగానే అధిగమించి నాగ్ అశ్విన్ చప్పట్లు కొట్టించేసుకున్నాడు. కానీ సావిత్రి అనే నటి తండ్రి ప్రేమను అన్వేషిస్తూ ప్రియుడి ప్రేమలో కూరుకుపోయి మనిషితనపు చిక్కుముడులను కరుణతో విప్పుకుంటూ సాగించే విషాదయాత్రను సినిమా చేయడం అంత తేలికయిన కష్టం కాదు..చప్పట్లు కొట్టించుకోవడం అంత సులువూ కాదు.
నాగ్ అశ్విన్ ఈ కష్టాన్ని కూడా సాధించాడు.
అందుకే నాగ్ అశ్విన్ గురించి మాట్లాడాలి.

ఎవడే సుబ్రహ్మణ్యం కథ,పాత్రలు దర్శకుడివి . వాటి పొడవు వెడల్పులోతులను దర్శకుడు తన ఆలోచనలకు అనువుగా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా మార్చుకోవచ్చు. కానీ సావిత్రి కథలో అది సాధ్యం కాదు. అందరికీ తెలిసిన అందరూ ప్రేమించే మనిషి ప్రయాణం గురించి కథకుడి చేతిలో ఉండేది శూన్యం. అయినా నాగ్ అశ్విన్ ఎక్కడా తడబడలేదు. అంతా క్లీన్ స్వీప్.
ప్రేక్షకుడిని దేవదాసులోకీ మూగమనసులలోకీ మాయాబజార్ లోకీ మంత్రముగ్దులను చేసి తీసుకెళ్లాడు.
అందుకే నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి.
మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నందుకూ కధను నడపడానికి జర్నలిస్టు పాత్రను స్రుష్టించినందుకూ పాత సినిమాల సన్నివేశాలను కథలో ఇమిడ్చి మనల్ని బ్లాకండ్ వయిట్ ఎరాలోకి తీసుకెళ్లినందుకూ..మిక్కీ నుంచి కూడా గొప్ప సంగీతం రాబట్టినందుకూ…
నాస్టాల్జిక్ ఫీల్ తో మత్తెక్కించినందుకూ..
కీర్తి సురేష్ తో సావిత్రి అంతటి నటన చేయించినందుకూ
ఎవరికైనా చివరకు మిగిలేది ఏదో కరకుగా చెప్పినందుకూ
నాగ్ అశ్విన్ గురించి మాట్లాడాలి.

నాగ్ అశ్విన్ గురించి మాత్రమే మాట్లాడితే అన్యాయమయే ఇంకొందరు కూడా ఉన్నారు మరి.
మహానటి అనేవారు ఒక్కరే ఉంటారు కనుక కానీ లేకుంటే మహానటి కీర్తి సురేష్ అంటే అతిశయోక్తయితే కాదు. విషాదాన్నీ హుషారునూ ప్రేమనూ కోపాన్నీ కరుణనూ సావిత్రికి అన్యాయం జరగని విధంగా కీర్తి పండించగలిగింది.
సందేహం లేదు కీర్తి ఈ కాలపు మహానటి.

“పెళ్లి చేసుకున్న వాళ్లు ప్రేమలో పడితే పరీక్ష పెళ్లికా ప్రేమకా”

” కథకోసం వెళ్ళాను చరిత్ర దొరికింది ”

“కనీసం పడిపోవడం క్రెడిటయినా నాకివ్వరా”

“పెళ్లి ప్రేమకు సమస్యకాకూడదు”

“ఎదురుగా కెమెరా లేకుండా నేను నటించలేను” …..లాంటి అనేక సంభాషణలతో సినిమాకు నిండుదనం తెచ్చిన సాయిమాధవ్, నలుపుతెలుపులనూ పంచరంగులనూ అందంగా పేర్చిన కెమెరా పనితనాన్నీ,
నాకయితే మొట్టమొదటి సారి నచ్చిన మోహన్ బాబు, చివరి సన్నివేశాలలో సమంత, వివిధ షేడ్స్ పలికించిన రాజేంద్రప్రసాద్ ..
అందరి గురించీ ఎంతో కొంత మాట్లాడుకోవాలి.

విజయ్ దేవరకొండ చేయడానికేమీ లేదు, నాగ చైతన్య చేసిందేమీ లేదు.

కొన్ని ఫాక్చువల్ష్ గురించి. జెమినీ గణేషన్ సావిత్రికి ఆమె కెరీర్ ప్రాధమిక దశలో సహాయం చేసినట్టు సినిమాలో చెప్పిన విషయం అవాస్తవం కావచ్చు. ఆమె పేరు సంపాదించుకున్నాకే జెమినీకి దగ్గరయినట్టు అందరికీ తెలుసు. జెమినీని సావిత్రి కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందన్నది జగమెరిగిన విషయం. కానీ సినిమాలో మాత్రం ముందే రహస్యంగా పెళ్లి చేసుకుని దాన్ని ఆ తరువాత వెల్లడించినట్టు చెప్పారు. కారు నడపడం కూడా సావిత్రికి జెమినీ పరిచయానికి ముందే వచ్చన్నది వాస్తవం అయితే సినిమాలో మాత్రం జెమినీ నేర్పినట్టు చూపారు. జెమినీ భార్య చాలా గద్దరిదనీ ఆమె చాలా సార్లు స్టూడియోలలోకి వచ్చి గొడవలు చేసిందనీ చరిత్ర చెపుతుంటే ఆమెనుంచి ఎటువంటి ప్రతిఘటనా లేనట్టు సినిమాలో చెప్పారు. మొత్తంగా చూస్తే జెమినీ పట్ల సావిత్రి ప్రేమికులకుండే కోపాన్ని ఈ సినిమా తగ్గించి అతడి గొప్పతనాన్ని చెప్పింది.
ఎస్వీ రంగారావ్ 74లొ చనిపోయారు. గోరింటాకు సినెమా 79. మహానటిలో గోరింటాకు తరవాత ఎస్వీఆర్ సావిత్రి కలిసినట్టు చూపారు.

మహానటి సినిమాకు నటీనట బంధుత్వాలకు సంబంధించి కూడా చిన్న చమత్కారం ఉంది. నిర్మాత అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్.ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ భార్య అశ్వనీదత్ కూతురు ప్రియాంక . ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురు కీర్తి సురేష్. ముమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. సావిత్రి చిన్నప్పటి పాత్రధారి రాజేంద్రప్రసాద్ మనుమరాలు. మిగతావాళ్ల బంధుత్వాలు తెలియనివి కావు.

సావిత్రిని జెమినీ గణేషన్ మోసం చేసాడట అని జనసామాన్యం అనుకునే పుకార్లలో వాస్తవం లేదనీ, తాగి తాగి చచ్చిందట అని సావిత్రి గురించి కూడా
అదే సామాన్య జనం అనుకునే నిందల్లోనూ వాస్తవం లేదనీ..సావిత్రి జీవన యానం ఒక తాత్విక అన్వేషణ అనీ, తనలోకి తాను ప్రయాణం చేస్తూ సావిత్రి మరణించింది ప్రేమరాహిత్యం అనే మహమ్మారి వల్లననీ తెలుసుకునేందుకు
సావిత్రిని ప్రేమించేవాళ్లూ సావిత్రి గురించి తెలియని వాళ్లూ చూడాల్సిన సినిమా.

పి.ఎస్: ఈ చిత్రం లోని పాత్రలు,సన్నివేశాలు అన్నీ కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు అని పడ్డ డిస్క్లైమర్ కార్డ్ మాత్రం అసలు సిసలు పంచ్!!రివ్యూ బై ప్రసేన్