న్యాయవాది వృతికి రాంజెఠ్మలానీ రాంరాం!

299

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ తన వృత్తికి రాంరాం చెప్పి ప్రవృత్తిలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పేరు విన్న వెంటనే గుర్తుకు వచ్చేది లాయర్‌గా ఆయన రూపం. తిమ్మిని బమ్మిని చేయటం, బమ్మిని తిమ్మిని చేయటంలో రాంజెఠ్మలానీ సిద్దహస్తుడిగా చెబుతుంటారు. అలాంటి ఆయన తన 94 ఏళ్ల వయసులో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసు ఏదైనా ఆయన టేకప్ చేశారంటే చాలు, ఆ కేసును వాదిస్తున్న ప్రత్యర్ధి లాయర్‌కు ముచ్చమటలు పడుతుంటాయి. ప్రముఖులకు ఏదైనా అనుకోని చట్టపరమైన విపత్తు ఎదురైతే వెంటనే గుర్తుకు వచ్చేది రాం జెఠ్మలానీ. న్యాయ సంబంధమైన అంశాల విషయంలో ఆయనకున్నంత పట్టు అంతా ఇంతా కాదు.

ఆయన కోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తున్నారంటే, న్యాయమూర్తులు సైతం అలెర్ట్ అయిపోతుంటారు. ఆయన వాదన ఎటు నుంచి ఎటువైపునకు వెళుతుందో అన్నది అంత తేలిగ్గా అర్థం కాదు. గంటల చొప్పున ఫీజులు వసూలు చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందని, ఆయన కేసు వాదించటానికి ఒప్పుకుంటే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు సిద్ధం చేయటానికి వెనకాడని క్లయింట్లు ఎంతో మంది ఆయనకు ఉంటారు. సంచలనం సృష్టించిన అంశాల మీద వాదనలు వినిపించటానికి వెనకాడే కేసుల్ని సైతం ఒప్పుకోవటం రాంజెఠ్మలానీ ప్రత్యేకతగా చెప్పాలి. ఆ కోర్టు ఈ కోర్టు అన్న తేడా లేకుండా ఏ కోర్టు అయినా సరే వాదనలు మాత్రమే ముఖ్యమని ఫీలయ్యే జెఠ్మలానీ అవసరానికి అనుగుణంగా వివిధ హైకోర్టులకు కూడా హాజరవుతుంటారు.

జెఠ్మలానీ కేసు వాదించటానికి ఒప్పుకున్నారంతనే సదరు వ్యక్తులు గుండెల నిండా ఊపిరి పీల్చేసుకోవటం కనిపిస్తుంది. అలాంటి రాంజెఠ్మలానీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను ఇకపై కేసులు వాదించనని చెబుతూ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. న్యాయవాద వృత్తికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన ఆయన తనను ఇకపై సరికొత్త పాత్రలో చూస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. అవినీతి రాజకీయ నాయకుల మీద పోరాటం చేస్తానని ప్రకటించిన ఆయన గత ప్రభుత్వాలు దేశాన్ని దుర్బరస్థితిలోకి నెట్టాయన్న వ్యాఖ్య చేశారు. యూపీఏతో పోలిస్తే ప్రస్తుత ఎన్డీయే సర్కారు దేశాన్ని పతనం దిశగా నడిపిస్తోందన్న వ్యాఖ్యలు చేస్తూ మోడీ మీద తనకున్న అక్కసును వెళ్లగక్కున్నారు. ఎన్డీయేతో సరైన సంబంధాలు లేని జెఠ్మలానీ రానున్న రోజుల్లో ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.