జనగాం నుంచి కోమటిరెడ్డి సతీమణి.. పొన్నాలకు కోమటిరెడ్డి చెక్

2593

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ చెక్‌ పెట్టినట్లే కనబడుతోంది. ఏకంగా జనగాం అసెంబ్లీ సీటుకు ఎసరు పెట్టేందుకు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్లాన్‌ ప్రకారం అడుగులేస్తున్నారు. అదే జరిగితే పొన్నాల ఎక్కడికెళుతారు… ఏ సీటు వెతుక్కుంటారు.. ఏమో మరి.. చదివి చూద్దాం.

 

2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి మరోసారి భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. భువనగిరి ఎంపీ స్థానం లేకపోతే మునుగోడు ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల∙ఒక సందర్భంలో తానే స్వయంగా మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. మరోవైపు తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు రాజగోపాల్‌ రెడ్డి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న జనగాం నుంచే లక్ష్మిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మికి రాజకీయాలపై అమితమైన ఆసక్తి ఉంది. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారు. అందుకే రాజగోపాల్‌రెడ్డి సైతం తన సతీమణిని, అదే క్రమంలో తన తనయుడిని ఫుల్‌ టైమ్‌ రాజకీయాల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే జనగాంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కణ్నుంచే లక్ష్మిని అసెంబ్లీకి పోటీ చేయించనున్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఆరు నెలలుగా కోమటిరెడ్డి భువనగిరి సెగ్మెంట్‌పైనే కన్నేసి ఉంచారు. అన్ని మండలాల్లో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు తన రాజకీయ బలాన్ని బలగాన్ని విస్తరించేందుకు శక్తి యుక్తులన్నీ ఒడ్డుతున్నారు. దీంతో గతంలో తను గెలిచిన ఎంపీ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవటంతో పాటు.. తన సతీమణిని జనగాం నుంచి పోటీ చేయిస్తే సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయని కోమట్‌రెడ్డి ధీమాతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అదే జరిగితే తన సొంత నియోజకవర్గం జనగాంపైనే ఆశలు పెంచుకున్న పొన్నాల లక్ష్మయ్య.. ఆయన కోడలు పొన్నాల వైశాలి భవితవ్యమేమిటీ.. ఎక్కణ్నుంచి పోటీ చేస్తారనేది రాజకీయ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా, మంత్రిగా పని చేసిన అనుభవంతో పాటు  సీనియర్ నాయకునిగా పొన్నాల రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడు. 1989 నుంచి వరుసగా ఆరు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య జనగాం నుంచే పోటీ చేశారు. రెండుసార్లు ఓడినా.. నాలుగు సార్లు అక్కడే ఎమ్మెల్యేగా గెలుపొందారు. మామకు ధీటుగానే మహిళా కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కోడలు పొన్నాల వైశాలి అదే సీటును ఆశిస్తున్నారు. ఒక దశలో వైశాలిని ఎంపీ సీటుకు పోటీ చేయించాలని గత ఎన్నికల సమయంలో పొన్నాల పావులు కదిపినప్పటికీ చివరకు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లోనూ పొన్నాల పోటీ నుంచి తప్పుకుంటారని, తనకు బదులు కోడలు వైశాలిని ఇక్కణ్నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కోమటిరెడ్డి తన సతీమణికి సేఫ్‌ సీటుగా భువనగిరిని ఎంచుకోవటం.. అక్కడే తన రాజకీయాన్ని విస్తరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈసారి కూడా వైశాలి ఆశలకు కోమటిరెడ్డి లక్ష్మి గండి కొడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.