భారీగా పారితోషికం పెంచేసిన ‘మహానటి’ ఎవరంటే..

319

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. అందాల భామ కీర్తి సురేశ్. ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నేను – శైలజ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ‘నేను లోకల్’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన ‘అజ్ఞాతవాసి’ నిరాశను మిగిల్చినప్పటికీ ‘మహానటి’ ఆ లోటును పూరించి ఈ మలయాళీ ముద్దుగుమ్మను అగ్రనటిగా నిలబెట్టింది.

‘మహానటి’ సాధించిన ఘనవిజయంతో కీర్తికి వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. దీంతో ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టు గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘యన్టీఆర్’ బయోపిక్ లోనూ కీర్తిని సావిత్రిగా నటించమన్నారని అడిగినట్టు సమాచారం. ఇదేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవితకథతో తెరకెక్కుతున్న ‘యాత్ర’లోనూ కీర్తి సురేశ్ నటించనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భామ తన పారితోషికాన్ని రెట్టింపు చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు తీసుకుంటున్న కీర్తి కోటి రూపాయల వరకు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి దర్శకనిర్మాతలు కూడా పెద్దగా అభ్యంతరపెట్టడం లేదని టాలీవుడ్ సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ తమ సినిమాలో ఉంటే కలిసొస్తుందని నమ్ముతున్న ప్రొడ్యూసర్లు ఆమె అడిగినంత ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. కీర్తి మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. తాను కథకు, తన పాత్రకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నానని, పారితోషికం తక్కువైనా చేయడానికి సిద్దమంటోంది.