బీసీలకు పెద్దపీట.. రాజ్యసభకు కేసీఆర్‌ వ్యూహం

665

చివరి వరకు ఉత్కంఠ కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కేసిఆర్‌ అంతరంగికుడు, కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు జోగినపల్లి సంతోష్‌ కు రాజ్యసభ సీటు వస్తుందని ముందునుంచీ ప్రచారం జరిగింది. అదే ఖరారైంది. యాదవులకు మరో సీటు కేటాయిస్తానని చెప్పిన టీఆర్‌ఎస్‌ అధినేత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌కు ఈ బెర్త్‌ ఖరారు చేశారు. గతంలో టీడీపీలో ఉన్న బడుగుల లింగయ్య యాదవ్‌ 2015 నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మూడో పేరుపై ముఖ్యమంత్రి చివరి వరకు గోప్యత పాటించారు. యాదవులకు ఇప్పటికే పెద్ద పీట వేసిన దృష్ట్యా బీసీల్లో మరో పెద్ద వర్గమైన ముదిరాజ్‌ కులానికి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

బీసీలకు పెద్దపీట వేయాలనే సమీకరణాల్లో భాగంగానే వరంగల్‌ జిల్లాకు చెందిన బండ ప్రకాష్‌కు మూడో సీటును ఖరారు చేశారు. రాజ్యసభ నామినేషన్లకు ఆఖరి రోజైన సోమవారం వీరందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ పెట్టే ఆలోచన చేస్తున్న తరుణంలో అవసరమైతే ఓటింగ్‌ జరిగితే ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలన్నదానిపైనా కేసిఆర్‌ ఎల్పీ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్‌ కు బలం సరిపోయేలా లేదు. ఎంఐఎం ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ ముగ్గురు అభ్యర్థుల గెలుపు లాంఛనమే.