తూర్పుగోదావరి జిల్లాలో జనసేన గెలుపును ఆపతరమా?

866

రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలు ఉన్న జిల్లా.. తూర్పుగోదావరి. ఇక్కడ మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ జిల్లాలో రోజురోజుకీ బలం పుంజుకుంటోంది.

ఇప్పటికే ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణ పార్టీలో చేరారు. శెట్టిబలిజ (గౌడ) సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గత మూడేళ్ల నుంచి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉండి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే ఆర్థిక వనరులు లేవనే కారణంతో వైఎస్ జగన్.. పితానికి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీలో చేరిన పితానిని ముమ్మిడివరం అభ్యర్థిగా ప్రకటించారు.. పవన్ కల్యాణ్.

ఇక ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డ రాజోలు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన రెండుసార్లు పవన్ కల్యాణ్ ను కలసి పార్టీలో చేరికపై చర్చించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాపాక వరప్రసాదరావు 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న రాజోలు జనసేన ఖాతాలో ఖచ్చితంగా చేరే సీటని విశ్లేషకులు భావిస్తున్నారు.

పితాని బాలకృష్ణ, రాపాక వరప్రసాదరావులే కాకుండా జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా శుక్రవారం పవన్ కల్యాణ్ ను కలసి పార్టీలో చేరికపై చర్చించారు. 2004, 2009ల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజేశ్వరికి నియోజకవర్గంలో మంచి అనుచరగణం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆమె జనసేన పార్టీలో చేరుతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన జోరు పెంచుతోంది. వీరేకాకుండా రానున్న రోజుల్లో భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశముందని తెలుస్తోంది.