జ‌న‌సేన‌తో.. ఆమ్ఆద్మీ చెట్టపట్టాలా..!

1239

అర‌వింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి..  ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసెస్‌ (ఐఆర్ఎస్‌) అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్ తన ప‌ద‌వికి రాజీనామా చేసి.. అవినీతిపై పోరాటంతో వెలుగులోకి వ‌చ్చారు.  అన్నాహ‌జారే నాయ‌క‌త్వంలో అవినీతికి వ్య‌తిరేకంగా, లోక్‌పాల్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఉద్య‌మం చేశారు. త‌ర్వాత ఆమ్ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో బీజేపీని చిత్తుగా ఓడించి అధికార పగ్గాలు చేపట్టారు.

ఇప్పడు కేజ్రీవాల్.. దక్షిణాది రాస్ట్రాలపై కన్నేశారు. సార్వ‌తిక్ర ఎన్నిక‌ల నాటికి పార్టీని దేశ‌మంతా విస్త‌రించాలని ఉవ్విళ్లూరుతున్నారట. బీజేపీయేత‌ర‌, కాంగ్రెసేత‌ర ప‌క్షాల‌తో క‌లిసి కూట‌మిని ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో కేజ్రీవాల్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల నాటికి పార్టీని ద‌క్షిణ భార‌త‌దేశంలో బలపడేలా చేయాలని కేజ్రీవాల్ ఫోక‌స్ చేశారు. ఎందుకంటే ఆమ్ఆద్మీ పార్టీకి ఢిల్లీ, పంజాబ్, హ‌రియాణా వంటి రాష్ట్రాల్లో మాత్ర‌మే గుర్తింపు ఉంది. ద‌క్షిణాదిన ఉన్న న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేదు. నిజం చెప్పాలంటే కార్వ‌నిర్వాహ‌క వ‌ర్గ‌మే లేదు.

ఈ క్ర‌మంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై గురిపెట్టి ఇక్క‌డ బ‌ల‌ప‌డ‌టం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్రియాశీల‌క పాత్ర పోషించాల‌ని ఆమ్ఆద్మీ ఉవ్విళ్లూరుతోంది. 2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చీపురు గుర్తుతో పోటీ చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)ని చిత్తుగా ఓడించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఉన్నమొత్తం 70 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ 67 స్థానాల‌ను గెలుచుకుంది. గెలుస్తుంద‌నుకున్న బీజేపీ కేవ‌లం 3 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత ఈ ఏడాది ఆరంభంలో ఎన్నిక‌లు జ‌రిగిన‌ పంజాబ్‌లో గెలుస్తుంద‌నే అంచ‌నాలు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ అక్క‌డ 115 సీట్ల‌లో పోటీ చేసి కేవ‌లం 20 సీట్లు మాత్ర‌మే గెలుచుకుంది. ఆ త‌ర్వాత గోవా ఎన్నిక‌ల్లోనూ సంచ‌ల‌నం సృష్టించే దిశ‌గా సాగినా అక్క‌డ ఉన్న‌40 సీట్ల‌లో ఒక్క సీటు ద‌క్కించుకోలేక‌పోయింది.

ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టుడు, త‌మిళ‌నాడుకు చెందిన క‌మ‌ల్ హాస‌న్‌తో కేజ్రీవాల్ చ‌ర్చ‌లు జ‌రిపారు. అప్పట్నుంచీ త్వ‌ర‌లో పార్టీ పెట్టి త‌మిళ‌నాట అవినీతికి చ‌ర‌మ‌గీతం పాడ‌తాన‌ని అన్నాడీఎంకేపై నిప్పులు చెరుగుతున్నారు క‌మ‌ల్‌హాస‌న్. మ‌రోవైపు క‌మ‌ల్‌హాస‌న్‌కు పోటీగా త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ‌, పురచ్చిత‌లైవి, జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో రాజకీయంగా చిన్నాభిన్న‌మైన త‌మిళ‌నాడులో పార్టీ స్థాప‌న‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌నుకుంటున్నారు త‌లైవ‌ర్ ర‌జినీ. దీంతో అటు క‌మల్‌హాస‌న్‌ను, ర‌జ‌నీకాంత్ ఇద్ద‌రినీ త‌న‌తో కలుపుకుపోవ‌డానికి కేజ్రీవాల్ పావులు క‌దుపుతున్నారు. అయితే న‌రేంద్ర‌మోదీకి మ‌ద్ద‌తుదారుడైన ర‌జనీకాంత్ అంత తేలిక‌గా కేజ్రీవాల్ బుట్ట‌లో ప‌డ‌తాడ‌ని అనుకోలేం.

ఇక రాష్ట్ర విభ‌జ‌న‌తో రెండు రాష్ట్రాలుగా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో.. వ‌రుస‌గా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధికారంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పాగాకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట కేజ్రీవాల్‌. అయితే తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల‌తోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా బ‌లంగా ఉన్నాయి. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్‌సీపీ.. అధికార పార్టీల‌పై పోరాడుతున్నాయి. వీటికి తోడు బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలు ఉండ‌నే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ క‌న్నుప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తునిచ్చి ఎక్క‌డా పోటీ చేయ‌లేదు జ‌న‌సేన పార్టీ. విభ‌జ‌న‌తో రాజ‌ధానిని కోల్పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, ఆన‌క మాట త‌ప్పిన భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు ప‌వ‌న్‌. ఇప్ప‌టికే ఏపీలో మూడు, నాలుగు చోట్ల ఆ పార్టీ నాయ‌కుల‌పై దుమ్మ‌త్తిపోశారు. ఉత్త‌రాదిలో బీజేపీపై ఒంటికాలితో లేస్తూ కాంగ్రెస్ కంటే ఎక్కువ విమ‌ర్శలు చేస్తున్న కేజ్రీవాల్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపంలో త‌న‌కు స‌రైన వ్య‌క్తి దొరికాడ‌ని అనుకుంటున్నార‌ట‌. దీంతో అతి త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసి ఆమ్ఆద్మీతో క‌లిసి న‌డ‌వ‌డానికి కేజ్రీవాల్ చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.