మళ్లీ ట్రంప్ వర్సెస్ హిల్లరీ.. ! వాట్ హాపెండ్

377

గతేడాది జరిగన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సోవియట్ రష్యా పతనం తర్వాత ప్రపంచంలో మిగిలిన ఏకైక సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్)నే కాబట్టి. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలతోనే ప్రపంచంలో ఆర్థిక, సామాజిక పరస్థితులు ప్రభావితమవుతాయి. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఏ దేశం వారైనా తమ దేశంలో ఎన్నికలంత హడావుడి చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి.. హిల్లరీ క్లింటన్ హోరాహోరీగా పోరాడిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు మన రాజకీయ నాయకుల వలె వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకున్న సంగతి విదితమే. అయితే ఖచ్చితంగా గెలుస్తారని మీడియా విశ్లేషణల్లో, వివిధ సర్వేల్లో తేలిన డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా పరాజయం పాలవగా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా తొలి మహిళ అధ్యక్షురాలిగా చరిత్రకెక్కాలనుకున్న హిల్లరీ క్లింటన్ చిన్నబుచ్చకోక తప్పలేదు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి ఏడాది అవుతున్నా.. ఇంకా వీరిద్ధరి మధ్య వైరం సమసిపోలేదు.

తాజాగా ‘వాట్ హేపెన్డ్’ పేరుతో హిల్లరీ ఓ పుస్తకాన్ని రాసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఆమె వివరించారు. దీంతో రెచ్చిపోయిన ట్రంప్.. హిల్లరీ వ్యాఖ్యలపై తన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ‘ఎదుట వారిని నిందించడమే తప్ప తప్పులు దిద్దుకోవడం హిల్లరీకి తెలియదు’ అని విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా అమెరికా ప్రజల పక్షానే పోరాడతానని హిల్లరీ చేసిన ప్రకటనను ఎద్దేవా చేశారు. వాస్తవాలు అంగీకరించడం ఆమెకు చేతకాదని, ఎదుటి వారిని ఆడిపోసుకోవడమే తెలుసని మండిపడ్డారు.