మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఏవో తెలుసా?

242

బాలీవుడ్ లో కొద్ది రోజుల కిందట విడుదలైన ‘సంజూ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం ధాటికి పలు చిత్రాల రికార్డులు బద్ధలయ్యాయి. ఒక రోజులో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా ‘బాహుబలి -2’ పేరిట ఉన్న రికార్డును కూడా ‘సంజూ’ బ్రేక్ చేసింది. ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం అతడి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

కాగా, విడుదలైన మొదటివారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ -5 చిత్రాల్లో ‘సంజూ’ నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బాహుబలి-2.. రూ.246.47 కోట్లతో ఉండగా, రెండో స్థానంలో సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ నటించిన ‘సుల్తాన్’ ఉంది. ‘సుల్తాన్’ మొదటి వారంలో రూ.208.99 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో స్థానంలో సల్మాన్ ఖాన్, అతడి మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్ జిందా హై’ నిలిచింది. ఈ చిత్రం మొదటి వారంలో రూ.206.04 కోట్లు కొల్లగొట్టింది.

నాలుగో స్థానంలో రణ్ బీర్ కపూర్ ‘సంజూ’ నిలిచింది. ఈ చిత్రం తొలి వారంలో రూ.200 కోట్లు వసూలు చేసింది. ఐదో స్థానంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘దంగల్’ నిలిచింది. ఈ చిత్రం మొదటి వారంలో రూ.192.38 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ‘సంజూ’ రూ.280 కోట్ల వసూళ్లు సాధించి రూ.300 కోట్ల క్లబ్బులో చేరడానికి వడివడిగా పరుగులెడుతోంది.