2 మిలియన్ డాలర్ల క్లబ్బులో గీత గోవిందం

260

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ ‘గీతగోవిందం’ వసూళ్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. తాజాగా యూఎస్ లో రెండు మిలియన్ అమెరికన్ డాలర్ల క్లబ్ లో ప్రవేశించి కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. అంతేకాకుండా అమెరికాలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ‘ఖైదీ నెంబర్ 150’, ‘శ్రీమంతుడు’, ‘ఫిదా’, ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ ఆ’ చిత్రాలతో పోటీపడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు సమర్పించిన ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్లు వసూలు చేసింది. మరోవైపు అటు హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇప్పటివరకు అర్జున్ రెడ్డి మూవీ బిగ్గెస్ట్ హిట్ నిలవగా ‘గీత గోవిందం’ దీన్ని క్రాస్ చేసింది. వినసొంపైన పాటలు, చక్కటి రొమాంటిక్ కామెడీ ఎంటరటైనర్ తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా రెండో వారంలో ప్రవేశించింది.

కాగా, అమెరికాలో విజయ్ దేవరకొండ చిత్రాల్లో గరిష్టంగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం 1.77 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీన్ని ఇప్పుడు గీతగోవిందం చిత్రం అధిగమించి రెండు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడంతో అటు హీరో విజయ్ దేవరకొండ, ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. దర్శకుడు పరశురామ్, హీరోయిన్ రష్మిక మంధనల కెరీర్ లో కూడా గీతగోవిందం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.