సికింద్రాబాద్‌ లోక్‌సభ బరిలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌. గెలిచేనా?

365

భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఎన్నో ఏళ్లు క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సేవలందించాడు.. ప్రముఖ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌. ఆ తర్వాత మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు గురికావడంతో 2000లో బీసీసీఐ అజారుద్దీన్‌పై నిషేధం విధించింది. ముందు నౌరీన్‌ అనే మహిళను వివాహం చేసుకున్న అజార్‌ తర్వాత ఆమెకు విడాకులిచ్చాడు. తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్‌ సంగీత బిజ్లానీతో చాలా కాలం ప్రేమాయణం నడిపిన అజార్‌ ఆమెను పెళ్లాడి 2010లో విడాకులు తీసుకున్నాడు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో ఎఫైర్‌ నడుపుతున్నాడని వార్తలు వచ్చినా ఇరువురూ వాటిని ఖండించారు.

కాగా, ఈ మాజీ కెప్టెన్‌ 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా ఎన్నికయ్యాడు. 2014లో రాజస్థాన్‌లోని టాంక్‌ సవాయ్‌ – మాధోపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఈసారి 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే తన ఆసక్తిని కాంగ్రెస్‌ అధిష్టానం దగ్గర వ్యక్తపరిచినట్లు సమాచారం. స్వతహాగా హైదరాబాద్‌ వాసి అయిన అజారుద్దీన్‌ పోటీ చేస్తే అటు ముస్లిం ఓట్లు కూడా ఆకట్టుకునే అవకాశం ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేతిలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు 2019లో జరిగే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా అజారుద్దీన్‌ పోటీ చేస్తే అంజన్‌ కుమార్‌ యాదవ్‌ హైదరాబాద్‌ నగరంలోని ముషీరాబాద్‌ నుంచి, అంజన్‌ కుమారుడు.. యూత్‌ కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఖైరతాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అజారుద్దీన్‌కు తన సీటు త్యాగం చేయడానికి అంజన్‌ ఒప్పుకున్నట్టు సమాచారం.