వర్షాకాలంలో జామ పండ్ల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..

759

మనకు ఎక్కువగా లభించే పండల్లో జామ ఒకటి. మన పల్లెటూళ్లలో దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ జామ చెట్లు దర్శనమిస్తాయి. ఎంతో రుచిగా ఉండే ఈ కాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.. వైద్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా?

జామ పండ్లలో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. జామ పండ్లు తింటే వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తదితర రోగాల నుంచి బయటపడొచ్చు. జామలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతోంది. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్ జబ్బులు రాకుండా నిరోధించే శక్తి దీనికి ఉంది.

అజీర్తి వ్యాధితో బాధపడేవారు జామ పండు తింటే చక్కటి సుఖ విరోచనమవుతుంది. జామ పండులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, పీచు పదార్థాలు జీర్ణాశయ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామ పండులో అత్యధికంగా ఉండే పొటాషియం, సోడియం అత్యధిక రక్తపోటును అదుపు చేస్తాయి. మన శరీరంలో ఉండే చెడు కొవ్వులను కరిగించడంలోనూ జామ చేసే మేలు అంతా ఇంతా కాదు. అజీర్తితో బాధపడుతూ, వాంతులు అవుతున్నప్పుడు నాలుగు జామ ఆకుల్ని తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి కొద్దికొద్దిగా తాగితే ఫలితం చక్కటి ఫలితం ఉంటుంది.

జామపండు శరీరంలోని ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా, నునుపుగా ఉండేలా చేస్తాయి. రోజూ కనీసం ఒక జామ పండు తింటే చర్మాన్ని మెరిసేలా ద్విగుణీకృతం చేసుకోవచ్చు. జామలో విటమిన్ సితోపాటు విటమిన్ ఏ కూడా ఎక్కువే. ఇది కంటి చూపును రక్షించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఒక జామ పండు తింటే ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఒక్క జామ పండు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అధిక ఆహారాన్ని తీసుకోకుండా చూసుకోవచ్చు. తద్వారా శరీరం బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.