కాపుల రాజ్యాధికారానికి దళితులు సహకారం అందిస్తున్నారా?

369

ఆంధ్రప్రదేశ్ లోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అగ్ర కులాల్లో ముఖ్యమంత్రులు కాలేని ఏకైక సామాజికవర్గం.. కాపులు. వైశ్యులు, బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు, కమ్మలు చివరికి దళితులు కూడా ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేశారు. కానీ వీరందరికంటే అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గం నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. దీనికి రకరకాల కారణాలున్నాయి. వంగవీటి మోహన్ రంగా సీఎం అవుతారని భావించినప్పటికీ నిరాహార దీక్షలో ఉన్న ఆయన్ను అతికిరాతకంగా హత్య చేయించింది ఎన్టీఆర్ ప్రభుత్వం.

ఇక తెలుగులో నెంబర్ వన్ హీరోగా, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకాభిమానులు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సీఎం అవుతారని కాపు సామాజికవర్గం భావించినా సాధ్యం కాలేదు. ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని ఎన్ని రకాలుగా తొక్కాలో అన్ని రకాలుగా తొక్కాయి.. ఎల్లో మీడియా పత్రికలు, చానెళ్లు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకుంది కాపు సామాజికవర్గం. రాష్ట్రంలో కాపులు దాదాపు 28 శాతం జనాభా కలిగి ఉండటం, కులాలు, మతాలకతీతంగా పవన్ కు అభిమానులుండటంతో ఈసారి పవన్ సీఎం కావడానికి అవకాశముందనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వినిపిస్తున్న మాట.

కాపులు రాజ్యాధికారం సాధించడానికి దళితులు కూడా సహకారం అందించనున్నారా అంటే అవుననే అంటున్నారు.. తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. తిరుపతి నుంచి ఐదు పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన చింతా మోహన్.. ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాపుల్లో మంచి పరిపాలన దక్షత, నైపుణ్యాలు కలిగినవాళ్లు చాలామంది ఉన్నారని చెప్పుకొచ్చారు. కాపులు రాజ్యాధికారం సాధించడానికి దళితులు తోడ్పాడును అందిస్తారని, 2024లో జరిగే ఎన్నికల్లో దళితులు రాజ్యాధికారం సాధించడానికి కాపులు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో కాపులు తర్వాత దళితులు 20 శాతం వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో చింతామోహన్ మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా పాల్గొన్నారు.