కాంగ్రెస్‌ బంతి.. కేసీఆర్‌ కోర్టులో..! రామ్మోహన్‌ రెడ్డి.. వంశీచంద్ పై వేటు..?

917

అసెంబ్లీలో కాంగ్రెస్‌ వీరంగం…. రణరంగం.. అదే స్పీడ్‌తో అధికార పక్షం చేపట్టిన బహిష్కరణం.. శాసనసభ బడ్టెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు అగ్గి రాజేశాయి. ఏకంగా నాలుగడుగులు ముందుకేసిన టీఆర్‌ఎస్‌ ఈ ఎపిసోడ్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు వరకు తీసుకెళ్లింది. జాతీయ స్థాయిలోనే అరుదైన దుశ్చర్యగా పరిగణించి..వివిధ రాష్ట్రాల్లో శాసనసభల్లో జరిగిన సంఘటనలు, తీసుకున్న చర్యలు… గత చరిత్రను తవ్వితోడింది. ఏకంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ సభ్యత్వాలను రద్దు చేసింది. చర్యల తీవ్రత, ప్రభుత్వ నిరంకుశత్వానికి నిరసనగా కాంగ్రెస్‌ «గాంధీ భవన్‌లో దర్నాకు దిగింది. అప్పటికీ వెనుకడుగు వేయని ప్రభుత్వం దూకుడుగా మరోఅడుగు ముందుకు వేసింది. ఆ ఇద్దరు సభ్యుల సభ్యత్వాలను రద్దు చేస్తూ మంగళవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రెండు సీట్లు ఖాళీ అయినట్లుగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌కు సమాచారం పంపించారు. వీడియో ఫుటేజీల ఆధారంగా సస్పెన్షన్‌కు గురైన వారిలో మరో ఇద్దరు సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందన్నట్లుగా లీక్‌లిచ్చారు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డిపై తదుపరి వేటు పడుతుందనే ప్రచారం మొదలైంది. కోమట్‌రెడ్డి, సంపత్‌ తరహాలో వీరిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తారా.. ఏడాది పాటు బహిష్కరణ విధిస్తారా.. అనేది వేచి చూడాల్సిందే. తదుపరి స్పీకర్‌ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ఎపిసోడ్‌ ఎవరికి ప్లస్‌.. ఎవరికి మైనస్‌… అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

 

హెచ్చరికలా.. సానుభూతి సంకేతాలా:
గత బడ్జెట్‌ సమావేశాల్లో అప్పటి టీడీపీ సభ్యుడు రేవంత్‌ రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు అదే వ్యూహాన్ని మరింత పకడ్బందీగానే కాంగ్రెస్‌పై ప్రయోగించింది. కానీ ప్రధాన ప్రతిపక్షం సభలో లేకుండా అసెంబ్లీ వ్యవహారాలు నడిపితే.. తమంతట తాముగా సభను నడుపుకుంటే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయనే కోణాన్ని విస్మరించినట్లుగా కనిపించింది. ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయటం ద్వారా విపక్షాల దుశ్చర్యలను కఠినంగా అణిచివేసేందుకు వెనుకబోడమనే కటువైన హెచ్చరికను జారీ చేసింది. కానీ కాంగ్రెస్‌ వీరంగం వెర్రి తలలు వేసినప్పటికీ.. సభ్యత్వాల రద్దు లాంటి చర్యలు ప్రజల్లో సానుభూతిని పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే అసెంబ్లీ ఎపిసోడ్‌ టీఆర్‌ఎస్‌ కంటే.. కాంగ్రెస్‌కే ఎక్కువ మైలేజీని తెచ్చి పెట్టిందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. కొంతకాలంగా అర కాలమ్‌.. పావు కాలమ్‌ వార్తలకు పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీకి మీడియాలోనూ కావాల్సినంత చోటు దొరికినట్లయింది.

రివర్స్‌ అటెన్సన్‌ డైవర్సన్‌:
ఇటీవలే దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని కేసీఆర్‌ చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఇటీవల జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అనూహ్యంగా కేసీఆర్‌ వేసిన ఎత్తుగడతో.. అప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర చిత్తయిపోయింది. వారికి కనీస ప్రచారం దక్కకుండా.. ప్రజల్లోనూ కాంగ్రెస్‌ యాత్రకు మించిన ప్రజల దృష్టిని మొత్తం తనవైపుకు మళ్లించటంలో కేసీఆర్‌ నూటికి నూరు పాళ్లు సక్సెసయ్యారు. ఇప్పుడు అదే కేసీఆర్‌.. కాంగ్రెస్‌ నేతల బహిష్కరణంలో ఎక్కడో తప్పటుగులు వేస్తున్నారా..? అనేది చర్చ మొదలైంది. కొంతకాలంగా ఏటికి ఎదురీదుతున్నట్లు తెలంగాణలో తండ్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ విసిరిన బహిష్కరణాస్త్రం కలిసొచ్చినట్లుగా కనబడుతోంది. మొన్నటివరకు బస్సు యాత్రతో రాని పబ్లిసిటీ, రాష్ట్ర ప్రజల అటెన్షన్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు మళ్లుతోంది.

రద్దయిన స్థానాలకు ఎన్నికలు వస్తాయా:
ఇప్పుడు స్పీకర్‌ నిర్ణయంతో ఖాళీ అయ్యే స్థానాలకు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న స్థానాలకు ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు ఉన్నందున.. ఈ సీట్లకు ఎన్నికలు జరపాలా.. వచ్చే సాధారణ ఎన్నికల దృష్ట్యా పెండింగ్‌లో పెట్టి.. అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా.. అనేది ఎన్నికల కమిషన్‌ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

రెడ్డిలతో పెరుగుతున్న దూరం:
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కారణంగా ఖాళీ అయ్యే నల్గొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాల్లో సానుభూతి పవనాలన్నీ కాంగ్రెస్‌కే వీచే అవకాశాలు మెండుగా ఉంటాయనటంలో సందేహం లేదు. అనుచిత ప్రవర్తన కారణంగా పరిగి, కల్వకుర్తి ఎమ్మెల్యేల సభ్యత్వాలు కూడా రద్దయితే అక్కడ కూడా కాంగ్రెస్‌కే కలిసి వచ్చే అవకాశాలుంటాయి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంత అసంతృప్తిని చవి చూస్తున్న కేసీఆర్‌కు తాజా పరిణామాలు వారిని మరింత దూరం చేస్తాయా.. అనే సందేహాలు రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి రేపుతున్నాయి. అందుకే ఈ ఎపిసోడ్‌ ఇంతటితో ఆగుతుందా.. ఇప్పట్నుంచే ఎన్నికల వేడి రాజేస్తుందా.. అనేది ఉత్కంఠ రేపుతోంది.