రోజుల లెక్కన భారీగా పారితోషికం పొందుతున్న ఆ కమెడియన్ ఎవరంటే..

389

టాలీవుడ్ లో మంచి హాస్య నటుల్లో ఒకరిగా సునీల్ ను చెప్పుకోవచ్చు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహితుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భీమవరం బుల్లోడు తనదైన టైమింగ్ తో ఎన్నో చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, వేణుమాధవ్ తదితరుల బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా తొలి చిత్రం ‘అందాల రాముడు’ తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’, వీరభద్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘పూలరంగడు’, డాలీ దర్శకత్వంలో వచ్చిన ‘తడాఖా’ చిత్రాలు మంచి విజయాలు సాధించి సునీల్ స్థాయిని పెంచాయి. డ్యాన్సుల్లోనూ మంచి నైపుణ్యాలు ప్రదర్శించడంతో వరుస అవకాశాలు ఒడిసిపట్టాడు.

అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ హీరో కమ్ కమెడియన్ డీలాపడ్డాడు. హీరోగా మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చోవడంతో కొన్ని మంచి అవకాశాలు కూడా చేజారిపోయాయి. కొన్నిటిని స్వయంగా సునీలే వదులుకున్నాడు. ఇప్పుడు హీరోగా అవకాశాలు లేకపోవడంతో మరోసారి కమెడియన్ గా రాణించడానికి మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలోనూ, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ చిత్రంలోనూ కమెడియన్ గా నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కమెడియన్ గా భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా మొత్తం లెక్కన కాకుండా రోజుల లెక్కన పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా మనోడికి భారీగానే అందుతున్నట్టు టాలీవుడ్ సమాచారం. మొత్తం మీద తనకు గ్రిప్ ఉన్న కామెడీనే నమ్ముకుని మనల్ని మళ్లీ కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు.. సునీల్