అమెరికా వెళ్లే రేసులో… చైనాతోనే మనకు పోటీ

1203

విశ్లేషణ: ఎస్.వి.రావు

ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భావజాలం వ్యాప్తి చేసి ఎన్నికల్లో గొలుపొందండటంతో పాటు విదేశీయులు అమెరికా గడ్డపై అడుగుపెట్టకుండా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఆ దేశంలోకి అడుగుపెడుతున్న భారత్‌, చైనా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల నుంచి విద్య పేరుతో అమెరికాలోకి అడుగుపెట్టి తదనంతరం అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవటంతోపాటు ఉద్యోగాలు సైతం కొల్లగొడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు వీసా నిబంధనలను కఠినతరం చేసి గరిష్ట సంఖ్యలో వలస విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ భారత్‌ నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య 12.3 శాతం పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలింది. భారత్‌ నుంచి 2015-16 సంవత్సరంలో 1.65 లక్షల మంది చదువు పేరుతో వీసాలు తీసుకొని ఆ దేశంలోకి అడుగుపెట్టగా 2016-17 సంవత్సరంలో ఆ సంఖ్య 1.86 లక్షలకు పెరిగింది.
ఈ విధంగా ఆ దేశంలోకి అడుగుపెడుతున్నవారిలో చైనావారు మనకన్నా అత్యధికంగా ఉంటున్నారు. ఇక్కడ అన్నింటికన్నా విచిత్రమేమిటంటే చైనా నుంచి అత్యధికంగా అమెరికాకు విద్య పేరుతో వలస పెరిగిపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిగిలిన దేశాల విద్యార్థులకు అమెరికాపై భ్రమలు, ఆశలు ఉండటం ఆశ్చర్యమేమీ కలిగించదు. కానీ కమ్యూనిస్టు దేశంగా చెప్పుకునే చైనా నుంచి మనకన్నా రెట్టింపు సంఖ్యలో వలస వెళుతుండటం విస్మయ పరుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సామ్యవాదాన్ని, కమ్యూనిజానికి దిశా నిర్దేశం చేసిన చైనా మావోల కాలం నుంచి కమ్యూనిజం వైపు అడుగులు వేసి పటిష్టమైన కమ్యూనిస్టు రాజ్యంగా ప్రపంచంలో స్థిరపడిపోయింది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే విధంగా చైనాలో కూడా ప్రైవేటు రంగాన్ని అనుమతించి బలమైన శక్తిగా ఎదిగేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం దోహదం చేసింది. అన్ని రంగాల్లోనూ దూసుకుపోవడానికి కమ్యూనిస్టు విధానాలు ప్రైవేటు రంగంతో పెనువేసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి విద్యార్థులు మాత్రం అమెరికా చదువులకు ఎగబడుతుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


చైనా నుంచి 2015-16 సంవత్సరంలో 3.28 లక్షల మంది వలస వెళ్లగా, 2016-17 సంవత్సరంలో 3.50 లక్షలకు చేరింది. అంటే 6.8 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం మీద చైనా అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత వరుసగా భారత్‌, సౌత్‌ కొరియా, సౌదీ అరేబియా, కెనడా దేశాలు తర్వాత స్థానాలను వరుసగా ఆక్రమించాయి. మొత్తంమ్మీద 10.78 లక్షల మంది విదేశాల నుంచి అమెరికాకు వలస వస్తే అందులో 32.5 శాతం చైనావారు కాగా తరువాత భారతదేశం 17.3 శాతంతోనూ రెండో స్థానంలో ఉంది. వీసాలు తీసుకొని చదువు పేరుతో చైనా, భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా చైనా నుంచి అధికంగా విద్యార్థులు విద్య పేరుతో వస్తున్నారు.