పాకిస్థాన్ కు చైనా భ‌లే షాకిచ్చిందే!

477

క‌శ్మీర్ స‌మ‌స్య‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో వివాదాస్ప‌దం చేసి ప్ర‌యోజ‌నం పొందాల‌నుకుంటున్న‌పాకిస్థాన్ కు దాని మిత్ర దేశం చైనా భారీ షాకిచ్చింది. క‌శ్మీర్ స‌మ‌స్య‌.. భార‌త్‌, పాకిస్థాన్‌లు క‌లిసి ప‌రిష్క‌రించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. దీనిలో త‌మ జోక్యం ఉండ‌బోద‌ని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్థాన్ గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డింది. ఐక్య‌రాజ్య‌స‌మితితోపాటు వివిధ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై క‌శ్మీర్ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తి భార‌త్‌ను ఇరుకును పెట్టాల‌నుకుంటున్న పాకిస్థాన్‌కు.. చైనా నిర్ణ‌యం తీవ్ర శ‌రాఘాత‌మ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

ఈ మేర‌కు కశ్మీరు సమస్యపై చైనా వైఖరి సుస్పష్టంగా ఉన్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి లూ కాంగ్ తెలిపారు. కశ్మీరు సమస్య అనేది చరిత్ర వదిలేసిన సమస్య అని పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్థాన్ పరస్పరం చర్చలు జరుపుకోవాలని, సంబంధిత సమస్యలను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని, శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాలని స్స‌ష్టం చేశారు.

గ‌తంలో భార‌త్‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్న పాకిస్థాన్ ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యీద్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించ‌డాన్ని చైనా అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. నాడు ఐక్య‌రాజ్య‌స‌మితిలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడితే చైనా వీటో ద్వారా హ‌ఫీజ్ స‌యాద్‌పై అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది ముద్ర ప‌డుకుండా కాపాడింది. అంతేకాకుండా భార‌త్‌ను దెబ్బ‌తీయ‌డానికి పాకిస్థాన్ కు, అమెరికాను దెబ్బ‌తీయ‌డానికి ఉత్త‌ర కొరియాకు అణు ప‌రిజ్ఞానం, సాంకేతిక టెక్నాల‌జీని బ‌దిలీ చేసిందీ చైనానే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అన్ని దేశాలు చైనాను వేలెత్తి చూప‌క త‌ప్ప‌నిసరి ప‌రిస్థితిని ఆ దేశం కొనితెచ్చుకుంది.

దీంతో త‌న‌పై ప‌డ్డ మ‌చ్చ‌ను చెరిపేసుకోవ‌డంతోపాటు భార‌త్‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌డానికి పాకిస్థాన్ కు సాయం చేస్తుంద‌నే నింద‌ను రూపుమాపుకోవ‌డానికి చైనా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో గుండా మ‌ధ్య ఆసియా, యూర‌ప్ దేశాల‌ను క‌లుపుతూ చైనా నిర్మిస్తోన్న వ‌న్ బెల్ట్ – వ‌న్ రోడ్ కు భార‌త్ నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవ‌డం కూడా ఇందులో భాగ‌మేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.