ఈ బాలీవుడ్ హీరోని కేసులు వదిలేలా లేవే

786

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కోర్టు కేసులు వదలడం లేదు. ఇప్పటికే రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడారన్న కేసు ఆయనపై నడుస్తోంది. అదేవిధంగా పుట్ పాత్ పై పడుకున్నవారిపైకి తాగి కారు నడపడంతో వారు మృతిచెందడంతో సల్మాన్ పై కేసు నమోదైంది. అయితే కారు నడిపింది తాను కాదంటూ, తన డ్రైవర్ కారు నడిపాడని చెప్పి ఈ కేసు నుంచి ఎలాగొలా బయటపడ్డాడు సల్మాన్.

ఇప్పుడు తాజాగా మరోమారు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదవుతోంది. ఈ మేరకు బిహార్ లోని స్థానిక కోర్టు ఒకటి ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్‌ ఖాన్‌ నిర్మిస్తున్న ‘లవ్‌రాత్రి’ అనే సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఫిర్యాదు రావడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ఓ స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. లవ్‌రాత్రి పేరు హిందూ పవిత్ర పండుగ దేవీ నవరాత్రులను పోలి ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ సినిమాను అక్టోబర్‌ 5న విడుదల చేస్తున్నారన్న న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఫిర్యాదుపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. దీంతో మరోమారు చిక్కుల్లో పడ్డాడు సల్మాన్. మరి ఈ కేసుల నుంచి ఎలా బయటపడతాడో వేచి చూడాల్సిందే.

కాగా లవ్ రాత్రి చిత్రాన్ని సల్మాన్ ఖాన్ నిర్మిస్తుండగా ఆయన సోదరి అర్పిత భర్త ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్నాడు. ఆయుష్ శర్మకు హీరోగా ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం. హీరోయిన్ గా వరైనా హుస్పేన్ నటిస్తోంది.