కేసీఆర్‌ ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉందా..!

1705

ఫెడరల్‌ ఫ్రంట్‌ అనుకున్నట్లుగానే అడుగులేస్తే… తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రధాని అవుతారా..? నిజంగానే జాతీయ రాజకీయాల్లో అటువంటి ఛాన్స్‌ ఉందా.. దేశంలో గుణాత్మక మార్పు అంటే ఎలా ఉండాలి.. ఎలా ఉండబోతోంది.. నిజంగానే ప్రజలు గుణాత్మక మార్పు కోరుకుంటున్నారా..? ఎన్నికల ముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయ పార్టీల లోగుట్టు సమీకరణాల భాగమేనా..? అనేది ఇప్పుడు నిజంగానే బిగ్‌ డిబేట్‌.

బీజేపీ, కాంగ్రెస్‌ సుదీర్ఘ పాలనను వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలే ఢిల్లీ పగ్గాలు చేపడితే.. గుణాత్మక మార్పు వస్తుందనేది కేసీఆర్‌ ఆలోచన. అంతరగమేదైనా.. అదే నినాదంతో ఫెడరల్‌ ఫ్రంట్‌కు పునాదులు వేసే పనిలో పడ్డారు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతానంటూ.. అవసరమైతే ఫెడరల్‌ ఫ్రంట్‌కు తానే నాయకత్వం వహిస్తానంటూ.. వన్‌ అండ్‌ ఓన్లీ ఆర్మీలా కేసీఆర్‌ రెండు నెలలుగా అదే పనిలో పడ్డారు. ఇప్పటికే∙పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్, మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవగౌడ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌కు రానున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించేందుకు కేసీఆర్‌తో భేటీ అవుతున్నారు. అఖిలేష్‌తో భేటీకి ముందుగానే కేసీఆర్‌ తన కుమారుడు ఐటీ మంత్రి కేటీఆర్‌ ను చర్చలకు పంపించారు. ప్లీనరీకి ఒక రోజు ముందుగానే లక్నోకు వెళ్లిన కేటీఆర్‌ సమాజ్‌ వాదీ పార్టీ అ«ధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ను కలిసి ఫ్రంట్‌ ఏర్పాటు గురించి చర్చించారు. సీఎం కేసీఆర్‌తో భేటీకి రావాలని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఈ భేటీతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సంప్రదింపులు మరో రాష్ట్రానికి విస్తరించనున్నాయి.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినంత మాత్రాన కేసీఆర్‌ ప్రధానమంత్రి అవుతారా..? అనే కోణంలో రకరకాల విశ్లేషణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెలంగాణ చిన్న రాష్ట్రం కావటం, అందులోనూ 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నందున కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పవనే అభిప్రాయాలున్నాయి. ప్రధాని పీఠంపై కేసీఆర్‌కు మించిన రాజకీయ ఉద్ధండులు, జాతీయ రాజకీయాల్లో సీనియర్‌ నాయకులు ముందు నుంచే కన్నేసి ఉంచారు. కేసీఆర్‌ కంటే ముందే ప్రధాని పీఠంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌ పవార్, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్, మరో మాజీ ముఖ్యమంత్రి మాయావతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి, బిహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ యునైటెడ్‌ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ వంటివారు కన్నేశారు. అవకాశమొస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ వంటివారు కూడా ప్రధాని పదవికి రేసులో ఉండే అవకాశాలు లేకపోలేదు.

ఉద్యమ సమయంలో ప్రజల బలమైన సెంటిమెంట్‌ అండగా ఉండటంతో కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ కనిపించింది. కానీ తెలంగాణ సీఎంగా ఇప్పుడు ఆ మద్దతు క్రమంగా తగ్గిపోయిందని, అందరు ముఖ్యమంత్రుల తరహాలోనే ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్‌కు స్పెషలాట్రక్షన్‌ ఏమీ లేదనే వాదనలున్నాయి. మరోవైపు ప్రధాని రేసులో ఉన్న సీనియర్‌ నేతలందరూ పెద్ద రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో తెలంగాణలో కంటే రెట్టింపు సంఖ్యలో ఎంపీలున్నారు. తమిళనాడులో 39, బిహార్‌ లో 40, పశ్చిమ బెంగాల్‌ లో 42, మహారాష్ట్రలో 48, ఉత్తరప్రదేశ్‌ లో 80, ఆంధ్రప్రదేశ్లో 25, ఒడిశాలో 21, కర్ణాటకలో 28 పార్లమెంటు సీట్లున్నాయి. దీంతో 17 సీట్లు మాత్రమే ఉన్న తెలంగాణలో మొత్తం సీట్లు గెల్చుకున్నా కేసీఆర్‌ ప్రధాని అయ్యే అవకాశాలు ఉండబోవని.. ఎక్కువ సీట్లున్న నేతలందరూ చక్రం తిప్పుతారనే వాదనలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన ప్రాంతీయ పార్టీల అధినేతలే ప్రదాని పదవికి రేసులో అందరి కంటే ముందే ఉంటారు. అది కూడా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అతి తక్కువ సీట్లు మాత్రమే వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ సీట్లు వచ్చినా లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత స్థాయిలో సీట్లు సాధించినా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకో లేదా కాంగ్రెస్‌ కో మద్దతు ఇవ్వక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.