భరత్ అనే నేను రివ్యూ

643

కొరటాల శివలూ మహేష్ బాబులూ దేవిశ్రీప్రసాద్ లూ పీటర్ హెయిన్స్ లు అందరూ డ్రీమ్ మర్చెంట్స్లే.
కలల బేహారులే.
వాళ్ల తప్పేం లేదు. కలల్ని అమ్మడం వాళ్ల వ్యాపారం.

కొంచెం బుర్ర కొంచెం గ్నానం కొంచెం చైతన్యం ఉన్న అతిమామ్మూలు సామాన్యుడికి కొన్ని కలలుంటాయి…
కొన్ని పగటి కలల్లాంటి కలలుంటాయి.
పిహెచ్ సి కి డుమ్మా కొట్టే డాక్టర్ని సిఎం నేరుగా వచ్చి సస్పెండ్ చేయాలనీ, రాజకీయ దౌర్జన్యంలో నలిగిపోతున్న స్వతంత్ర అభ్యర్దిని సిఎం అంతటి వాడొచ్చి శత్రువులను దునుమాడి గెలిపించాలనీ,
అన్యాయం అక్రమం అనే మాటల్లోంచి అ అనే అక్షరాన్ని ముఖ్యమంత్రే రంగంలోకి దిగి డస్టర్ తో తుడిచేయాలనీ లాంటి పిచ్చి కలలు కొన్నుంటాయి. వీళ్ల తప్పు కూడా ఏమీ లేదు.
అలాంటి కలలే కనడం వీళ్ల హక్కు.
ఆ వ్యాపారులు ఈ కలల్నికథగా చేసి అమ్మకానికి పెడితే అదే భరత్ అనే నేను.

అంతకు ముందు ఇదే ప్రయత్నం చేసిన’ ఒకే ఒక్కడు ‘ కొంచెం, ఇంకొంచెం ‘లీడర్’ కథలను కలిపి గిలకొట్టేస్తే అదే భరత్ అనే నేను.
అయితే ఆ కల చుట్టూ చుట్టిన రేపర్, కట్టిన రిబ్బన్ వెరశి ప్యాకింగ్ అందంగా లేకపోవడమే లోపం.

తెలివైన అభ్యుదయ భావాలున్న ఆధునిక యువకుడికి అనుకోకుండా సిఎం అయే అవకాశం రావడం, ఆతడు ఎడా పెడా మనబోంట్లయిన సామాన్యులు కోరుకునే మార్పులన్నీ చేసేసి మన మనసులను కొల్లగొట్టేస్తుంటే
సైసలేని అస్మదీయులు తస్మదీయులు జట్లు కట్టేసి కుర్చీ ఈడ్చి పడేస్తే మళ్లీ దాన్ని సొంతం చేసుకోవడమే కత.

అత్యంత సామాన్యుడి ఆకాంక్షను కథగా ఆసరా చేసుకుని దాని చుట్టూ అతిశయోక్తికి మించిన ఆర్బాటాలను అల్లి
సినిమాలను సూపర్ డూపర్ హిట్ చేసుకున్న శంకర్ ధోరణి కొరటాలలో కొంత కనిపిస్తున్నప్పటికీ శంకర్ తన ఒక్కో సినిమాలో
ఒక్కో ఆకాంక్షను ప్రధానంగా తీసుకున్నాడు. శివ సినిమాలన్నింటిలో లైన్ మారట్లేదు… హీరోకు మాంచి సామాజిక ఆశయమొకటి
ఉండడం దానికి పలు అడ్డంకులు రావడం.. అధిగమించి
హీరో తన ఆశయాలను నెరవేర్చుకోవడం… ఇదే..శ్రీమంతుడైనా, జనతా గారేజైనా ఇప్పుడు భరత్ అనే నేను అయినా.
కొరటాల వారూ ఇక్కడ కరెక్షన్ నీడెడ్.

ఓకే ..అల్ప సంతోషుడయిన తెలుగు ప్రేక్షకుడు ఇంతకంటే గొప్ప కథ కోసం ఆశపడట్లేదులే కానీ రొడ్డకొట్టుడు కథకు జనతా గారేజ్ కార్పోరేషన్
కార్యాలయం సీనో, శ్రీమంతుడు తోటలో రౌడీలనూ రాజకీయ నాయకులనూ దత్తత తీసుకునే సన్నివేశమో లాంటివి జోడిస్తే కొట్లకు కోట్లిచ్చే
టెల్గూ వ్యూయర్ మంచితనాన్ని ఇక్కడ శివ వాడుకోలేకపోయాడు. రాజకీయ ప్రత్యర్దుల మధ్య ఉండాల్సిన తీవ్ర సన్నివేశాలు,
హీరోకు ధీటైన ప్రతినాయకుడు.. సినిమాలో మిస్సింగ్.
ప్రకాష్ రాజ్ ఎక్కడా బలమైన శత్రువుగా కనపడడు. మిగతావాళ్లంతా ఆటరాని ఎక్స్ట్రా ప్లేయర్లే.

సినిమా నిండా అసంబద్దతలు బోలెడు. ముఖ్యమంత్రి లవ్ ట్రాక్ వల్ల అతడు ఆశయం మరచి రిచ్ జులాయిగా మారాడా అనే అనుమానం
ప్రేక్షకుడిని పీడించేస్తుంటుంది. కథలో కామెడీనీ ఐటమ్ సాంగ్ నీ త్యజించిన శివ లవ్ ట్రాక్ ను కూడా పరిహరించి ఉండాల్సింది. లవ్ ట్రాక్
వల్ల కథకు పెద్ద ప్రయోజనం లేదు… సిఎం లవ్ ఎఫైర్ అనే తప్పుడు ప్రచారం కోసం తప్ప.
నిజానికి కుర్ర సిఎం ఒక అమ్మాయిని అదీ మామ్మూలు
కానిస్టేబుల్ కూతుర్ని ఇష్టపడుతున్న విషయం బయట పడితే దానికే రాజీనామా చేయాల్సిన అవసరం వాస్తవ ప్రపంచంలో ఉండదు.
అదేం నేరం కూడా కాదు. మీడియా దాన్ని బయట పెట్గగానే నేనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని ప్రకటించేస్తే చాలు సమస్య పరిష్కారం అయిపోతుంది.
అరవైఐదో ఏట కుర్రదాన్ని పెళ్లి చేసుకున్న దిగ్విజయ్ సింగ్ నూ, మూడో నాలుగో పెళ్లిళ్లు చేసుకున్న తెలుగు పవనాలనూ, ముగ్గురితో
లివ్ ఇన్ రిలేషన్ గడిపిన కమల్ నూ మనం నాయకులుగా అంగీకరిస్తున్న ఉదాహరణలున్నాయి. ఈ సందర్బాన్ని కథలో పెద్ద బాంగ్ గా వాడడం, ఆ సాకుతో మీడియాను అడ్డదిడ్డంగా తిట్టడం అచ్చమైన అసందర్బం. ఆ సంబంధాన్ని మీడియా ఎఫైర్ అనే రాస్తుంది తప్ప అక్రమ సంబంధం అని రాయదు. వివాహానికి దారి తీసే సంబంధాల పట్ల మీడియాకానీ సమాజం కానీ అసహ్యంగా వ్యాఖ్యానించదు. ఫైన్ కట్టకుండా ఉండాలంటే ఫైన్ కట్టాల్సిన
తప్పులు చేయకపోవడమే పరిష్కారం అని తెలిసిన ముఖ్యమంత్రికి ఎఫైర్ అనే విమర్శకు పెళ్లి అనేది సమాధానం అని తెలియకపోవడం ఏమిటో.

నాయకుడు అవసరం లేని సమాజాన్ని తయారు చేయడమే నాయకుడి లక్ష్యం అని నమ్మే వ్యక్తి అది సాధించినట్టుగా కనపడదు. మంచి చేయాలంటే
అధికారం కావాలి అధికారం నిలుపుకోవాలంటే తప్పులు చేయాలి లాంటి సంభాషణలు బాగున్నాయి.
ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేటు కళాశాలలు, పాఠశాలలపై దాడులు వంటి సన్నివేశాలు..తరతరాలుగా జరుగుతున్న
తప్పులను చిన్న కరెక్షన్ చేయగానే రాజరికాలు గుర్తొచ్చాయా అనే డైలాగ్ సందర్బం కెసిఆర్ కు ప్రశంసలే..
అదేదో యాడ్ లో అంతా చెప్పాక కిత్నాదేతా అనే ప్రశ్న వచ్చిపడ్డట్టు ఇంతా రాసాక ఇంతకీ బాగుందా బాలేదా అన్నదే అసలు సిసలు ప్రశ్న.

కొరటాల కోణంలో చెప్పాలంటే శ్రీమంతుడు, జనతాగారేజ్ లకంటే బాలేదు. మహేష్ బాబు కోణంలో చెప్పాలంటే బ్రహ్మోత్సవం, స్పైడర్ కంటే బాగుంది.