టాలీవుడ్ లో ఈ హీరోయిన్ కెరీర్ ఇక ముగిసినట్టేనా?

333

తెలుగులో 2016లో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ లో ఆరంగేట్రం చేసింది.. కేరళ భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. రాజ్ తరుణ్ సరసన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో నటించినా అమ్మడికి నిరాశే ఎదురైంది. వీటిల్లో ఒక్క చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించకపోవడంతో అమ్మడి హవాకు బ్రేక్ పడింది.

మంచి ఒడ్డూపొడవు, రూపలావణ్యాలు, చక్కటి ఫిజిక్ ఉన్నప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ కు అదృష్టం కలసి రావడం లేదు. తాజాగా నాగచైతన్య హీరోగా దాసరి మారుతి దర్శకత్వంలో విడుదలయిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా ఆమెను ఆదుకోలేదని తెలిసిపోయింది. వినాయకచవితినాడు సెప్టెంబర్ 13న విడుదలయిన ఈ చిత్రంపై అంత పాజిటివ్ రివ్యూలు రాలేదు.

దీంతో అను ఖాతాలో మరో పరాజయం చేరినట్టే. ఒక్క సినిమా ఫ్లాపు అయితేనే హీరోయిన్ల మొహం చూడని నేటి రోజుల్లో, అది కూడా సెంటిమెంట్లను ఫాలో అయ్యే టాలీవుడ్ లో ఇన్నాళ్లూ కెరీర్ ను నెట్టుకురావడం అను ఇమ్మాన్యుయేల్ గొప్పతనమేనని చెప్పొచ్చు. తాజాగా శైలజారెడ్డి అల్లుడు కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోవడంతో ఇక అమ్మడి కెరీర్ ముగిసినట్టేనని భావించొచ్చు. తాజాగా మరే కొత్త చిత్రంలోనూ ఆమె బుక్ కాకపోవడమే దీనికి నిదర్శనం.