అమలాపురం ఎంపీ సీటు కచ్చితంగా జనసేన ఖాతాలో చేరినట్టేనా?

1143

తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన లోక్ సభ నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి గతంలో లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వంటివారు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం తెలుగుదేశానికి చెందిన పండుల రవీంద్రబాబు ఎంపీగా ఉన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఎంపీ హర్షకుమార్ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

హర్షకుమార్ గతంలో రెండుసార్లు అంటే.. 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా నిజాయతీపరుడిగా హర్షకుమార్ కు పేరుంది. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి నాయకుడిగా ఆయన అనేక ఉద్యమాలు నిర్వహించి వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంచి ఫైర్ ఉన్న నేతగానూ పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు హర్షకుమార్ జనసేన పార్టీలో చేరుతుండటంతో ఆయన గెలుపు సునాయాసమేనని విశ్లేషకులు అంటున్నారు. అమలాపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మాలలుండటంతోపాటు కాపులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. హర్షకుమార్ మాల సామాజికవర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో జనసేన తరఫున ఆయన సులువుగా గెలవచ్చనే అభిప్రాయం అందరిలో వినిపిస్తోంది. నియోజకవర్గంలో కాపు, మాల కులాల ఓట్లే 70 శాతానికిపైగా ఉండటంతో హర్షకుమార్ కు ఎదురులేదని చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అమలాపురంలో గట్టిపోటీనిచ్చింది. ఆ ఎన్నికలో హర్షకుమార్ విజయం సాధించినప్పటికీ రెండో స్థానంలో పీఆర్పీనే నిలిచింది. అప్పుడు హర్షకుమార్ కు వచ్చిన మెజారిటీ కేవలం 40,000 మాత్రమే. తెగులుదేశం మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈక్వేషన్ల నేపథ్యంలో హర్షకుమార్ జనసేన తరఫున పోటీ చేస్తే గెలుపు ఖాయమని ఘంటాపథంగా చెప్పొచ్చు.