బుల్లెట్ స్పీడెంతో తెలుసా..!

583

ప్యాసింజర్ ట్రెయిన్ గురించి సరిగ్గా తెలియని వారు కూడా ఇప్పుడు బుల్లెట్ ట్రెయిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అహ్మదాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రెయిన్ పనులకు ప్రధాని నరేంద్రమోడీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే శంకుస్థాపన చేశారు. ఇంతకీ ఈ బుల్లెట్ రైలు ప్రత్యేకత ఏంటీ..? దీనికి ఇప్పుడు మనం చూస్తున్న రైళ్లకు తేడా ఏంటీ..?

ఖర్చెంత..?
ప్రస్తుతం అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ రైలు పనులు ప్రారంభం అయ్యాయి. దీని అంచనా వ్యయం 1.08 లక్షల కోట్లు. 2023 వరకు దీన్ని పూర్తి చేయాలని మొదట అనుకున్నారు. కానీ వారం క్రితమే నిర్ణయం మార్చుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2022 ఆగస్టు లోపు పనులు పూర్తి చేసి ఆగస్టు 15న రైలును ప్రారంభించాలని నిర్ణయించారు.

స్పీడెంత..?
బుల్లెట్ ట్రెయిన్ అంటే.. మరీ బుల్లెట్ అంత స్పీడుగా వెళ్లకున్నా.. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మధ్యలో స్టేషన్లలో ఆగాలి కాబట్టి.. యావరేజ్ గా దీని స్పీడు 320 కిలోమీటర్లు. ముంబై నుంచి అహ్మదాబాద్ కు రెండు గంటల 58 నిమిషాల్లో చేరుకుంటుంది. ఇందులో ఫ్లైట్ లో లాగా రెండు రకాల సీట్లుంటాయి. ఎగ్జిక్యూటీవ్, ఎకానమీ క్లాస్ సీట్లుంటాయి.

టికెట్ రేటెంత..?
గంటలకు మూడు వందల యాభైకిలోమీటర్ల స్పీడుతో వెళ్లే ఈ ట్రైన్ టికెట్ రేట్లు కూడా ఫ్లైట్ లో మాదిరిగా ఉంటాయనుకోకండి. కాస్త తక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఏసీ టూ టయర్ టికెట్ కు దీని రేట్లు చాలా దగ్గరగా ఉంటాయి.

రైళ్లెన్ని..? ఎక్కేదెంతమంది..?
ప్రస్తుతం ఇందులో పది కోచ్ లుంటాయి. 750 ప్రయాణికులు కూర్చోవచ్చు. 16 కోచ్ లున్న ట్రెయిన్ లో 1250 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఏడాదిలో 1.6 కోట్ల మంది బుల్లెట్ ట్రెయిన్ సర్వీసును వినియోగించుకుంటారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. 35 ట్రెయిన్స్ తో ప్రారంభించి 2053 కల్లా 105 వరకు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది.

మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది..?
ముంబై – అహ్మదాబాద్ మధ్య పది స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. థానె, విరార్, బోయిసర్, వపై, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్, సబర్మతి స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 92 శాతం ఎలివేటెడ్ రూట్ అంటే ఫ్లై ఓవర్ల మాదిరిగా కట్టేస్తారన్నమాట. ఆరు శాతం టన్నెల్స్, రెండు శాతం భూమి మీద ప్రయాణిస్తుంది. మరో ఏడు కిలోమీటర్లు సముద్రంలో టన్నెల్ నిర్మించనున్నారు. బోయిసర్ … బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య 21 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ , రైల్వే శాఖ ఉమ్మడిగా ఈ ప్రాజెక్టు చేపడుతోంది. 508 కిలోమీటర్ల పరిధిలో బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణానికి 825 హెక్టార్ల భూమి అవసరమవుతోంది.